ఈ–కేవైసీకి గడువు పొడిగింపు
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) లబ్ధిదారులకు ఈ–కేవైసీ పూర్తి చేయడానికి గడువును 2 నెలలు పొడిగించింది. కొత్త గడువు ఫిబ్రవరి నెలాఖరు వరకు నిర్ణయించారు. ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమశాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో ఈ విషయాన్ని ప్రకటించారు. అర్హత కలిగిన లబ్ధిదారులలో 96 శాతం మంది ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేశారు. కేవలం 4 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే ఇంకా ప్రక్రియ ను పూర్తి చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారులు తమ ఆధార్–లింక్డ్ ఈ–కేవైసీ పూర్తి చేయడానికి వారికి సమీపంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణం, రేషన్ కార్డ్ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ చౌక ధరల ధరల దుకాణాలు, రేషన్ కార్డ్ నిర్వహణ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తి చేయకపోయినా పీడీఎస్ వస్తువుల ను అందుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం ఇప్ప టి వరకు 8 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపి ణీ చేసింది. ఈ–కేవైసీ పూర్తి కాకపోవడం వల్ల అర్హత కలిగిన ఏ లబ్ధిదారుడు ఆహార భద్రతను కోల్పోలేదని మంత్రి తెలిపారు.
జయపురం: బొరిగుమ్మ భైరవ కళాశాల అధ్యా పకుడు డాక్టర్ సుధాంశు శేఖర్‌పట్నాయక్‌ను బలంగీర్ జిల్లా కంటాభంజిలో నిర్వహించిన జాతీయ శిశు, కిశోర్ సాహిత్య సమ్మేళనంలో సన్మానించారు. సరస్వతీ సమ్మాన్ బిరుదుతో సత్కరించారు.
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం 11 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పలాసకు చెందిన చిన్నారి లల్లిప్రియ నాయక్ స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అయితే చిన్నారి పాఠశాలకు వెళ్లేందుకు బుధవారం ఆసక్తి చూపకపోవడంతో తల్లి అనీషా నాయక్ మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక చాలాసేపటి వరకు పాఠశాలకు గానీ, ఇంటికి గానీ రాకపోవడంతో తల్లిదండ్రులు అందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో స్థానికుల సలహా మేరకు బాధితులు కాశీబుగ్గ పోలీసులను అశ్రయించారు. వెంటనే కాశీబుగ్గ సీఐ ఎ.రామకృష్ట స్పందించి రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రైల్వే కాలనీలో బేల చూపులతో నడుచుకుంటూ వెళ్తున్న బాలికను పోలీసులు గుర్తించి స్టేషన్‌కి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు అందించిన 2 గంటల్లోనే చిన్నారిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించడంపై పోలీసుల పనితీరుని పలువురు అభినందించారు.
ఇచ్ఛాపురం: పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వే ఎల్‌సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 86.950 కేజీలు భారీగా గంజాయి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకి చెందిన ఒక కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశాలోని బరంపురం లంజిపల్లికి చెందిన ప్రపుల్‌కుమార్ జలి అనే వ్యక్తి కారులో గంజాయిని తీసుకొని విజయనగరంలోని హిమాన్సుశేఖర్ మజి అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని ఒడిశాలోని మోహన బ్లాక్ గుమిగుడ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని అతని వద్దనుంచి గంజాయి, సెల్‌ఫోన్, కారుని సీజ్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: డీసీసీబీ బ్యాంక్ అందించే పథకాలను ఖాతాదారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ బ్యాంక్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులు, చేతివృత్తులవారు, వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీ అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు అని, నవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు జనరల్ మేనేజర్లు శిమ్మ జగదీష్, డి.వరప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎస్‌వీఎస్ సత్యనారాయణ, శిల్లా రమేష్, జి.సునీల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఆర్‌కే భాస్కరరావు, బి.దశరథరామ్, బి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


