దొరికిన దేవాలయ చోరీల దొంగలు
నరసన్నపేట: జిల్లాలో నరసన్నపేటతో పాటు పోలాకి, నౌపడ, సంతబొమ్మాళి, సారవకోట, కాశీబుగ్గ పోలీసుస్టేషన్ల పరిధిలోని పలు ఆలయాల్లో చోరీ కేసులను నరసన్నపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి వద్ద 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేవూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధు ముగ్గురూ నరసన్నపేటలోని గొట్టిపల్లికి వలస వచ్చి చెరువు గట్టుపై కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరు ముగ్గురూ గ్రామాల్లో తిరుగుతూ పాత ఇనుము సామాగ్రి కొనుగోలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా గ్రామ శివారుల్లోని ఆలయాలను గమనించి రాత్రి ఎవరూ లేని సమయాల్లో తాళాలు విరగ్గొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. దీంట్లో భాగంగా పోలాకి మండలంలోని తెల్లవానిపేటలో అసిరితల్లి అమ్మవారి ఆలయం, గుప్పెడుపేటలోని నీలమ్మ తల్లి ఆలయం, రహెమాన్‌పురంలో అమ్మవారి కోవెల, శివరాంపురంలో అసిరితల్లి ఆలయం, మబగాం కాలనీలో చెన్నమ్మ తల్లి ఆలయం, నౌపాడలో రామాలయం, సంతబొమ్మాళిలో అమ్మవారి ఆలయం, సారవకోటలో వేంకటేశ్వరాలయం ఇలా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. అయితే వీరు ముగ్గురు పోలాకి మండలం వనవిష్ణుపురంలోని ఆలయంలో దొంగతనం చేయడానికి వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలాకి ఎస్‌ఐ రంజిత్ కుమార్ సిబ్బందితో కలిసి మాటువేసి వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామన్నారు.


