జనావాసాల్లోకి హైనా
కొరాపుట్: జననావాసాల్లోకి హైనా ప్రవేశించి దూడపై దాడికి పాల్పడింది. బుధవారం వేకువజామున కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి బీజాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన గోశాలలో ఆవుదూడపై దాడి జరగడంతో అరుపులకు గ్రామస్తులు మేల్కొన్నారు. దీంతో హైనా అటవీ ప్రాంతంలోనికి పారిపోయింది. ఇదే నెలలో మూడు మేక పిల్లలను హైనా ఎత్తుకుపోయిందని గ్రామస్తులు వాపోయారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని పశు వైద్య సిబ్బంది ద్వారా దూడకు చికిత్స అందించారు.


