లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెం ఫ్లై ఓవర్ వంతెన కింద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగడ చిన్నలచ్చయ్య (74) బస్సులో ప్రయాణిస్తూ చిలకపాలెం వద్ద దిగాడు. లావేరు మండలం బుడుమూరు సంతకు వెళ్లే క్రమంలో ఫ్లై ఓవర్‌ను దాటుతుండగా.. చిలకపాలెం వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో వృద్ధుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్‌సీడీఆర్‌సీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ)లో ఇద్దరు సభ్యుల ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ వినియోగదారుల శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు జడ్జి/పదేళ్ల అనుభవం గల జిల్లా జడ్జి/జిల్లా అదనపు జడ్జి/వ్యాపార న్యాయ ఆర్థిక అకౌంటింగ్ తదితర రంగాలలో 25 ఏళ్ల పైబడి అనుభవము కలిగిన 50 ఏళ్ల పైబడిన వారు అర్హులని పేర్కొన్నారు.


