పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధి జరగకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్.ఉదయగిరి సమితి చైర్మన్ లక్ష్మీనారాయణ సొబొరో అన్నారు. అందువలన పాఠశాలలను అభివృద్ధి చేయాలని కోరారు. గజపతి జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ 78వ సాధారణ మ్యానేజ్‌మెంట్ కమిటీ సమావేశం, 71వ ప్రాజెక్టుల స్థాయి కమిటీ సమావేశాలు స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి విచ్చేయగా, కలెక్టర్ బిజయకుమార్ దాస్ అధ్యక్షత వహించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, గిరిజనాభివృద్ధి ప్రత్యేక పథకాలు కింద రూ.1.49 కోట్ల నిధులు ఖర్చు చేయడం జరిగిందని ఐటీడీఏ అధికారి అంశుమాన్ మహాపాత్రో తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ జీవికా మిషన్ ద్వారా ఐదు సమితి కేంద్రాలు మోహనా, ఆర్.ఉదయగిరి, నువాగడ, గుమ్మా, రాయఘడ సమితుల్లో 79 గ్రామ పంచాయతీ, 311 రెవెన్యూ గ్రామాలు, 143 జనజాతి జీవికా మిషన్స్ ఏర్పాటు చేయడం వలన 14,385 మంది గిరిజనులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని పేర్కొన్నారు. రామగిరి, మహేంద్రగడ, రాయఘడ సమితిల్లో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యాలు మెరుగుపరచాలని రాయఘడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్, గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, మోహనా సమితి చైర్మన్ కున్నా మఝి తదితరులు కోరారు.
ఏడేళ్ల తర్వాత సమావేశాలు
సమావేశాల అనంతరం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి విలేకరులతో మాట్లాడుతూ ఏడేళ్ల తర్వాత ఐటీడీఏ సాధారణ కార్యవర్గ సమావేశాలు జరిగాయన్నారు. గిరిజన ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పీఎం నరేంద్రమోదీ, సీఎం మోహన్‌చరణ్‌ల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. సమావేశాల్లో నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్, జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి
పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి


