సమన్వయంతో శ్రీరామనవమిని విజయవంతం చేయాలి
నెల్లిమర్ల రూరల్:
ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రామతీర్థంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీఓ దాట్ల కీర్తి సూచించారు. ఈ మేరకు మండలంలోని రామతీర్థంలో కల్యాణం ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఒక్కో శాఖకు చెందిన అధికారితో మాట్లాడి చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కల్యాణ వేదిక చుట్టూ టెంట్లు ఏర్పాటు చేయాలని భక్తులకు మజ్జిగ, నీరు సరఫరా చేయాలని చెప్పారు. ఆలయం వెలుపల, కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఫైర్, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కల్యాణం అనంతరం స్వామి తలంబ్రాల పంపిణీ ప్రక్రియ ప్రధాన ఘట్టమని, ఆ ప్రక్రియలో ఎటువంటి తోపులాటలు జరగకుండా క్యూలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కల్యాణ వేదికపైకి భక్తులు వెళ్లకుండా పోలీసులు చూసుకోవాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, 108, 104, ఫైర్ ఇంజిన్ వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా ఫైర్ అధికారి రాం ప్రకాష్, తహసీల్దార్ సుదర్శనరావు, ఎంపీడీఓ రామకృష్ణరాజు, నాయకులు సువ్వాడ రవిశేఖర్, కంచరాపు రాము, గేదెల రాజారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ దాట్ల కీర్తి
శ్రీరామనవమి ఏర్పాట్లపై
అధికారులతో సమీక్ష
సమన్వయంతో శ్రీరామనవమిని విజయవంతం చేయాలి


