ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి..
సాలూరు: శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర ఆకాంక్షించారు. పట్టణంలోని వెలమపేట, డబ్బివీధి, తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలను రథంలో ఉంచి మేళతాళాల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పీడిక రాజన్నదొర పాల్గొని రథం లాగారు. ఈ సమయంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.
బైక్ రికవరీ
పార్వతీపురం రూరల్: రెండు రోజుల వ్యవధిలో పోయిన బైక్‌ను పోలీసులు రికవరీ చేశారు. పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషి తెలియజేసిన వివరాల మేరకు.. ఈ నెల 28న పార్వతీపురం రూరల్ పరిధి వైకేఎం కాలనీలోని ఓ కిరాణా దుకాణం వద్ద పార్క్ చేసిన పల్సర్ ఎన్‌ఎస్ 200 ద్విచక్ర వాహనాన్ని ఎవరో దొంగిలించారు. దీంతో బాధితుడు ఆదిత్య (సీతానగరం మండలం) మరుచటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై సంతోషి ఆధ్వర్యంలో పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మక్కువ మండలానికి చెందిన ఇద్దరు మైనర్ల నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గంట్యాడ: ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల మేరకు.. కొఠారుబిల్లి కనకదుర్గమ్మ ఆలయం వెనుక ఉంటున్న కురిమిశెట్టి కృష్ణ అనే వ్యక్తి ఇంటికి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనచోదకుడు ఢీకొట్టాడు. దీంతో కృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
వీరఘట్టం: మండలంలోని తూడి జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మీసాల తిరుపతిరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొండ మండలం పొట్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు వీరఘట్టం నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళుతుండగా.. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు.
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ రామస్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామి కి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోనికి స్వామివారిని వేచింపజేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, ఋత్విగ్వరణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 40 మంది ఋత్విక్కులచే ఈ నెల 6వ తేదీ వరకు శ్రీమద్రామాయణ, సుందరకాండ, సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించనున్నారు.
వేద రుత్విక్కులచే పారాయణాలు
స్వామివారి ఆస్థాన మండపం వద్ద వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రుత్విక్కులచే శ్రీమద్రామయణం, సుందరకాండ పారాయణాలు, సుదర్శన శతకం, నాలాయర దివ్య ప్రబంధ, తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం యాగశాలలో సుందరాకాండ, గాయత్రీ రామాయణాలు, సుదర్శన శతకం హోమాలను నిర్వహించి అగ్నిప్రతిష్టాపనను గావించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి..


