జయపురం: విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులకు గురుతర బాధ్యత ఉందని జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన్ కుమార్ నాయక్ అన్నారు. జయపురంలోని సరస్వతీ బాల మందిర వార్షికోత్సవాన్ని సోమవారం స్థానిక సంఘం కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందన్‌కుమార్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక మైన విద్య నేర్పాలన్నారు. సరస్వతీ బాల విద్యామందిర్ పరిచాలన కమిటీ ఉపాధ్యక్షుడు నవీనచంద్ర మహంతి అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయులు ఓం ప్రకాశ్ మిశ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, ఆకాశవాణి జయపురం విభాగ విశ్రాంత అధికారి ఉదయ శంకర జానీ, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయక్, సహాయక కార్యదర్శి చంద్ర శేఖర మహాపాత్ర, కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి ప్రసంగించారు. క్రీడా, విచిత్ర వేషధారణ, తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాలలో ప్రతిభావంతులను సన్మానించారు. యోగా, నృత్య, సంగీత ప్రదర్శనలు అలరించాయి. కొంత మంది విద్యార్థులు కవితలు చదివి వినిపించారు.