పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుల గల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం జరగనున్న 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. రెండోసారి మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనుండడంతో పోటీదారుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్లు పోటీ పడనున్నట్టు నిర్వాహకులు హరిశంకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించేందుకు అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోటీలకు సంబంధించి 16 మంది న్యాయ నిర్ణేతల నిర్ణయం తుది తీర్పుగా భావించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోటీదారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు.