భువనేశ్వర్: రౌర్కెలా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దిలీప్ రే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రితో 3 ముఖ్యమైన అంశాలను చర్చించారు. రౌర్కెలాలో కొత్త రైల్వే మండలం ఏర్పాటు, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) విస్తరణ, రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి, విస్తరణ పనుల్ని ప్రతిపాదించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రౌర్కెలా కేంద్రంగా కొత్త రైల్వే మండలం ఏర్పాటు రౌర్కెలా, పరిసర జిల్లాల నుంచి రైల్వేకి గణనీయంగా ఆదాయం పెంచేందుకు దోహద పడతాయి. రైల్వే రంగంలో ఈ ప్రాంతం మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సేవల పరంగా వెనుకబడి ఉంది. మెరుగైన అనుసంధానం దక్షతతో కూడిన నిర్వహణ ఖనిజ నిక్షేప ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రౌర్కెలా కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజనన్‌ను రూపొందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు. సెయిల్ ఆధ్వర్యంలో రౌర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) విస్తరణ దీర్ఘకాలంగా మొరాయిస్తుంది. భూ సేకరణ సవాళ్ల కారణంగా వేగవంతంగా కొనసాగాల్సిన రూ.30,000 కోట్ల ఆర్‌ఎస్‌పీ విస్తరణ ప్రణాళిక కార్యాచరణ స్తంభించి పోయింది. ఈ ప్రాజెక్టు వేగవంతం చేస్తే ప్లాంట్ సామర్థ్యత రెట్టింపై ఉక్కు ఉత్పత్తిలో జాతీయ స్వావలంబనను బలోపేతం చేస్తుంది. వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. సత్వర పరిష్కారంతో రౌర్కెలా స్టీల్ ప్లాంట్ విస్తరణ పట్ల రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని అభ్యర్థించారు. అలాగే రౌర్కెలాలో పూర్తిస్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.