తెగేసి చెప్పిన గన్నవరం ఎయిర్‌పోర్టు నిర్వాసితులు ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుపై ఆగ్రహం
గన్నవరం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీరుపై గన్నవరం ఎయిర్‌పోర్టు నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తమ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తేనే సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోని కూటమి పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు వేసేదిలేదంటూ తేల్చిచెప్పారు. విమానాశ్రయం నిర్వాసితుల సంఘానికి చెందిన సుంకర పద్మశ్రీ, యు.వేదవతి, కాలనీవాసులతో కలిసి సోమవారం సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణ కోసం పదకొండేళ్ల క్రితం తమ ఇళ్లను తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా గృహాలు నిర్మించి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. రోడ్లు, డ్రైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్ల మధ్య తవ్విన మైక్రో కెనాల్ నుంచి తీవ్ర దుర్వాసన, దోమల బెదడతో పాటు రాత్రి వేళలో విషసర్పాలు ఇళ్లలోకి వస్తుండడంతో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నామంటూ దావాజిగూడెం ఎస్సీ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లుగా తమ గోడును పట్టించుకోని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తేనే మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద స్థలాలు కేటాయించడంతో పాటు మౌలిక వసతులకు, గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల విడుదల కాలేదని కాలనీవాసులు తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలను గాలికి వదిలేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో కెనాల్ కోసం తొలగించిన 40 ఇళ్లకు అద్దె బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పద్మశ్రీ మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణకు ప్రభుత్వం ఇళ్లు, స్థలాలు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు ఇంతవరకు న్యాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డపై తక్షణం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ నేతలు కొడాలి సుధాకర్ పాల్గొన్నారు.


