ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షలు స్వీకరించేందుకు విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ అధికారులను ఆదేశించారు. మహామండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో ఆలయ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే భవానీ మండల దీక్షలతో పాటు డిసెం బర్‌లో ప్రారంభమయ్యే అర్ధమండల దీక్షలు, కలశజ్యోతి మహోత్సవాల ఏర్పాట్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డులో ఉన్న డోనర్ సెల్‌తో పాటు భక్తులకు మరింత అందుబాటులో ఉండేలా ఆలయం వెలుపల మరో కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమ్మవారికి బంగారం, వెండి కానుకలను సమర్పించే భక్తుల కోసం ఈ కౌంటర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. దాతలు ఆలయానికి ఇచ్చే విరాళాలు, కానుకల విషయంలో ఏఈవోలు, సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి రశీదుపై తప్పనిసరిగా వారి సంతకాలు ఉండేలా చూడాలన్నారు. ఒక వేళ డోనర్ రశీదులపై తగిన సంతకాలు లేని పక్షంలో బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మహామండపం నాల్గో అంతస్తులో సీసీ కెమెరా, డేటా సెంటర్ గదుల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థను ఈవో పరిశీలించారు. సమావేశంలో డీఈవో కిషోర్‌కుమార్, ఏసీ రంగారావు, ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్, సుధారాణి, గంగాధర్, ఈఈ ఎల్.రమ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో మరో డోనర్ సెల్


