పటమట(విజయవాడతూర్పు): డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించ డంలో కెనరా బ్యాంక్ ముందంజలో ఉందని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆర్.దేవరాజ్ పేర్కొన్నారు. కెనరా బ్యాంక్ వ్యవస్థాపకుడు అంబెమ్మల్ సుబ్బారావు జయంతి, బ్యాంక్ 121వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం బ్యాంక్ సాధించిన ప్రగతిని ఆయన గుర్తుచేశారు. 1906లో ప్రారంభమైన కెనరా బ్యాంక్ రూ.30 లక్షల కోట్లకు పైగా వ్యాపారంతో దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. వ్యవస్థాపకుల దూరదృష్టి, వినియోగదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావంతో బ్యాంక్ నిరంతరం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. బ్యాంక్ వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా వినియో గదారులు, భాగస్వాములు, ఉద్యోగులు, వాటాదారుల అభివద్ధికి కెనరా బ్యాంక్ కట్టుబడి ఉందని తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్ విలువలను కొనసాగిస్తూనే, డిజిటల్ సాంకేతికతతో నూతన ప్రస్థానాన్ని నిర్మించడమే బ్యాంక్ లక్ష్యమని జనరల్ మేనేజర్ ఆర్.దేవరాజ్ పేర్కొన్నారు.
పెనమలూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి స్థలం ఆక్రమించి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ రైతు బజార్‌లో కూరగాయలు కొనటానికి వచ్చిన వృద్ధుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కానూరు గ్రామంలోని డాల్ఫిన్ అపార్టుమెంట్‌లో నివసించే ఇంజేటి పావని(45), ఆమె తండ్రి కాంతారావు(86) బుధవారం జాతీయరహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ రైతుబజార్‌కు వచ్చారు. కూరగాయలు కొని రైతుబజార్ వద్ద ఆటో ఎక్కుతున్న సమయంలో కంకిపాడు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కాంతారావు, పావని గాయపడ్డారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కాంతారావు మృతి చెందాడు. ఈ ఘటన ప పోలీసులు కేసు నమోదు చేశారు
తరచూ ప్రమాదాలు
కానూరులో జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ రైతు బజార్‌కు వచ్చే వారు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ వాహనాలు జాతీయ రహదారిపైనే పార్కు చేయటం, రోడ్డు రద్దీగా ఉండ టంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రైతుబజార్ ఏర్పాటు చేయటంతో ప్రజలకు ప్రాణాంతకంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కృష్ణలంక(విజయవాడతూర్పు): తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లారు. పిల్లలు ఇద్దరూ కింది అంతస్తుకు తాళాలు వేసి పై అంతస్తులో నిద్రించారు. అదే అదునుగా నేరగాళ్లు తాళాలు పగలకొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు, రూ.7 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణలంక పోలీసు స్టేషన్‌పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భ్రమరాంబపురంలో నివసించే ఇప్పిలి సత్యనారాయణ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఈ నెల 17న భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లగా, కుమారుడు భానుప్రసాద్, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. వారి ఇల్లు రెండతస్తుల భవనం కాగా మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పిల్లలిద్దరూ కింద అంతస్తుకు తాళం వేసి పై అంతస్తుకు వెళ్లి నిద్రించారు. బుధవారం ఉదయం భానుప్రసాద్ కింది అంత స్తుకు రాగా తలుపులు తీసి కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి సామగ్రి అంతా చిందరవందరగా ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించిన భానుప్రసాద్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని బీరువాలో ఉండాల్సిన 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 78 తులాల వెండి వస్తువులు, రూ.7 లక్షల నగదు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆన్‌లైన్ లావాదేవీలు జరపనప్పటికీ రిటైర్డ్ ప్రొపెసర్ అకౌంట్‌లో రూ.9 లక్షలు మాయమైన ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. టీచర్స్ కాలనీలో నివసించే ఉప్పాల సత్యనారాయణ సిద్ధార్థ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు వైద్య కళాశాలలోని కెనరా బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. ఉద్యోగ విరమణ అనంతరం ఆ ఖాతా కొనసాగిస్తున్నారు. అందులోనే నెలనెలా పింఛన్ జమవుతోంది. ఆయన ఫోన్‌కు ఈ నెల 16న అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్ కోసం రూ.25 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బ్యాలెన్స్‌ను చెక్ చేయగా రూ.18 లక్షలకు రూ.9.33 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయన బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఆయన అకౌంట్ నుంచి అక్టోబరు 12 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు వరకూ 11 విడతలుగా రూ.8.99 లక్షలు కట్ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. తాను ఆన్‌లైన్ లావాదేవీలు జరపనని, ఓటీపీలు ఎవరికీ చెప్పలేదని అయినా మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.


