దళిత మహిళ బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

దళిత మహిళ బలవన్మరణం

Nov 19 2026 12:43 PM | Updated on Nov 19 2026 12:43 PM

దళిత మహిళ బలవన్మరణం ● పోలీసుల వేధింపులే కారణమని విమర్శలు ● చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

● పోలీసుల వేధింపులే కారణమని విమర్శలు ● చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా

జగ్గయ్యపేట అర్బన్‌: మండలం చిల్లకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన యండ్రాతి మరియమ్మ (45) పోలీసుల వేధింపుల కారణంగా మానసిక వేదనకు గురై బుధవారం ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ–2 మణికంఠతో పాటు జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు మూడు రోజులుగా ఆమెను పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని, ఈ వేధింపులే ఆమె మృతికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన న్యాయవాది శేషుకుమారి ఇంటి ప్రహరీని కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమంగా కూలగొట్టి, ఆమైపె భౌతికంగా దాడి చేయడానికి ప్రయత్నించారు. శేషుకుమారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని దౌర్జన్యం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులు కోర్టు ముందు మూడు రోజులుగా ప్రహరీని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోడ కూలగొట్టిన వ్యర్థాలను తొలగించే పనికి యండ్రాతి మరియమ్మను ఆమె సోదరి మందా దానమ్మ తీసుకెళ్లింది. వీరు అక్కడ వారు శిథిలాలను తొలగిస్తుండగా శేషుకుమారి తరఫువారు ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో దానమ్మ గ్రామం నుంచి వెళ్లిపోయింది. ఫొటోలో ఉన్న యండ్రాతి మరియమ్మను పోలీసులు గుర్తించారు. దానమ్మను పట్టుకునేందుకు మరియమ్మను మూడు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారు. దానమ్మ కుమార్తె కీర్తిని కూడా మరియమ్మతో పాటు మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. దానమ్మను ఎక్కడ ఉంచారో చెప్పాలంటూ ఒత్తిడిచేశారు. తనకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికి పంపించండని కీర్తి కోరినా పోలీసులు స్పందించలేదు. రాత్రి 8.30 గంటల తరువాత పంపించి, తిరిగి రాత్రి 9.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. బుధవారం తెల్లవారు జాము రెండు గంటల వరకు వేల్పుల విజయకుమార్‌ ఇంటి వద్దకు పిలిపించి విచారించారు. దీంతో మానసిక క్షోభకు గురైన మరియమ్మ బుధవారం ఉదయం ఆరు గంలకు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతిచెందింది. దీనిపై చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేయాలని ఎంత బతిమిలాడినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా

మరియమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులుగా తేలిన పోలీస్‌ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్‌ వారికి అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్ర ఎంఎస్‌పీ నాయకుడు కోట దానియేలు, ఎమ్మార్పీఎస్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఆదూరి నాగమల్లేశ్వరరావు, పేట మండల ఇన్‌చార్జ్‌ చింతల గోపి, ఎంఎస్‌పీ పేట మండల ఇన్‌చార్జ్‌ దావీదు, ఎంఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement