విజయవాడ లీగల్: విజయవాడలో సంచలనం సృష్టించిన మాషా అల్లా కేసులో ఏ–2 నిందితుడు రమేష్‌రెడ్డిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులో తీసుకున్నారు. విచారణ అనంతరం బుధవారం ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం రెండో అదనపు జిల్లా కోర్ట్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆ నిందితునికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
కంకిపాడు: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అభ్యర్థులను చూస్తే కూటమి నేతల వెన్నులో వణుకు పుడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు బరిలో దిగకుండా ఉండేలా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక కూటమి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఆయా గ్రామాల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా కంకిపాడు, ఉయ్యూరు పరిసర గ్రామాల్లో ఇటీవల నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు శాతం ఏ మాత్రం చెక్కు చెదరలేదని స్పష్టమైంది. దీంతో స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంలో కూటమి నేతలు ఉన్నారు. దీంతో బెదిరింపులకు తెగబడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంత భూములను సాగు చేసేది కౌలు రైతులే. వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసినా, అభ్యర్థులకు మద్దతు తెలిపి బలపర్చినా, ప్రచారంలో పాల్గొన్నా సహించేది లేదంటూ కూటమి నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. వచ్చే సీజన్‌లో కౌలు చేసేందుకు భూములు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా పంచాయతీల్లో కొత్త పింఛను దరఖాస్తులు అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. పింఛను లబ్ది చేకూరాలన్నా, సంక్షేమ పథకాలకు అర్హత దక్కాలన్నా ‘గమ్మున ఉండాల్సిందే’ అంటూ హుకుం చేస్తున్నారు. రూపాయి అప్పు కూడా పుట్టదని బెదిరిస్తున్నారు. తలొగ్గకుండా పోటీకి సిద్ధపడుతున్న నేతలకు మండల స్థాయిలో ముఖ్యనేతలతో ఏకంగా ఫోన్‌లు చేయించి సద్దుమణిగేలా చూసుకుంటున్నారు. రెండు రోజులుగా ఈ తరహా బెదిరింపుల పర్వం అధికమైంది. ప్రశాంతతకు పట్టుకొమ్మలుగా ఉన్న పల్లెల్లో సైతం విద్వేషాలను రెచ్చగొట్టేలా కూటమి వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ కల్చరల్: తెలుగు సాహిత్యం, భాషా వికాసం, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న డాక్టర్ జి.వి.పూర్ణచందుకు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో 2026 సంవత్సరానికి జాతీయ జ్ఞానజ్యోతి పురస్కారాన్ని పూర్ణచందుకు బుధవారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని వెలుగులోకి తీసుకురావడంలో పూర్ణచందు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో రచయితల మహాసభల నిర్వహణకు పూర్ణచందు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ చిల్లర భవానీదేవి మాట్లాడుతూ.. సాహితీవేత్తల ప్రతిభను గుర్తించి ఏటా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జ్ఞాన జ్యోతి పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. సాహితీవేత్త గబ్బిట దుర్గాప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ పూర్ణచందుకు జ్ఞానజ్యోతి పురస్కారం ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారి రమాదేవి, రచయితల సంఘ సభ్యులు చింతా లక్ష్మీసుజాత, శర్మ, నానా, సుభానీ, వశిష్ట పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ నిర్వహించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): పెనమలూరు మండలం పోరంకిలోని చిగురుపాటి శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో డిసెంబర్ నాలుగు నుంచి ఆరో తేదీ వరకు ‘అమరావతి బాలోత్సవం– 9వ పిల్లల పండుగ జరుగుతుందని అమరావతి బాలోత్సవం గౌరవాధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు తెలిపారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పిల్లల పండుగ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు, బాలోత్సవం అధ్యక్షుడు యడ్ల పార్థసారథి, కార్యదర్శి పి.మురళీకృష్ణ మాట్లాడుతూ.. చిన్నారుల్లో సామాజిక బాధ్యత, విశాల దక్పథం పెంపొందించడానికి 2017 నుంచి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది వివిధ జిల్లాలలోని 18 మండలాల నుంచి 195 పాఠశాలల విద్యార్థులు 11,600 మంది పాల్గొ న్నారని, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ ఎంట్రీ ఫారాలను పూర్తి చేసి ఈ నెల 30వ తేదీలోగా నేరుగా లేదా 63059 54249 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు. ఈ సమావేశంలో చీఫ్ పాట్రన్ బాయన వెంకట్రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.విద్యాకన్నా, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కార్యదర్శులు వై.సుబ్బారావు, యు.వి.రామరాజు, పి.ఐజాక్ న్యూటన్, కొల్లూరు వెంకట్, టి.క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామ్మోహన్, కె. ప్రసన్నకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలలో సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున సుమారు 50 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. వారిలో పలువురిని గుమ్మగట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారని, మరికొందరు రాయదుర్గమలో చికిత్స పొందుతున్నారని వివరించారు. విద్యార్థినులకు అందించే ఆహార నాణ్యతను పర్యవేక్షించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


