ఆ కాళరాత్రికి 49 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆ కాళరాత్రికి 49 ఏళ్లు

Nov 19 2026 12:43 PM | Updated on Nov 19 2026 12:43 PM

ఆ కాళరాత్రికి 49 ఏళ్లు

1977 నవంబర్‌ 19వ తేదీ రాత్రి దివిసీమపై విరుచుకుపడిన ఉప్పెన కడలి కల్లోలానికి వేలాది మంది జలసమాధి నేటికీ మరువలేని చేదు జ్ఞాపకాలు

కోడూరు: సముద్రంలో ఎగసిపడిన రాకాసి అలలు ఉప్పెనగా మారి దివిసీమ ప్రాంతాన్ని కకావికలం చేసిన రోజు.. రాకాసి అలల ధాటికి వేల మంది జలసమాధి అయిన రోజు.. ఊళ్లకు ఊళ్లు సముద్రుడి ఉగ్రరూపానికి కొట్టుకుపోయిన రోజు.. ప్రకృతి బీభత్సానికి చిగురుటాకులా వణికిన దివిసీమ ప్రజానీకాన్ని ఎప్పుడూ వెంటాడే విషాద ఘటన అది.. అదే 1977 నవంబర్‌ 19వ తేదీ రాత్రి దివిసీమను ముంచెత్తిన ఉప్పెన. మరువలేని మహాప్రళయం సంభవించి 49 ఏళ్లు గడిచినా నాటి దృశ్యాలను తలుచుకుంటే దివిసీమ ప్రజలు నేటికీ హడలిపోతున్నారు.

కొట్టుకుపోయిన గ్రామాలు

ఉప్పెన ప్రభావానికి సొర్లగొంది, పాలకాయతిప్ప గ్రామాలు కొట్టుకుపోయాయి. పాలకాయతిప్ప, హంసల దీవి, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురం, బసవానిపాలెం, ఉల్లిపాలెం, నాగాయలంక మండలంలోని సొర్లగొంది, ఏటిమొగ, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచెట్లదిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో ఉప్పెనకు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నాగాయలంక మండలంలోని సొర్ల గొందిలో అత్యధికంగా 714 మంది, పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెంలో 300 మంది మృతిచెందారు. దివిసీమ ప్రాంతంలోనే సుమారు రూ.172 కోట్లు మేర ఆస్తినష్టం వాటిల్లింది. మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ, మచిలీపట్నం మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాలో ఉప్పెన దాటికి చాలా మేర ఆస్తినష్టం సంభవించింది. రేపల్లె, నిజాంపట్నం ప్రాంతా ల్లోని పలు గ్రామాలు ఈ ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి. ఒక్క కుటుంబంలో నలుగురు నుంచి ఐదుగురు వరకు మృత్యవాత పడ్డారు. మృతదేహాలకు సామూహికంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఎందరో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు దివిసీమలో పర్యటించి ఘోర విపత్తను చూసి చలించారు.

అండగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు

స్వచ్ఛంద సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు విపత్తు అనంతరం దివిసీమను పుననిర్మించేందుకు తోడ్పాటును అందించాయి. నాడు రాష్ట్ర మంత్రిగా ఉన్న మండలి వెంకటకృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప్పెన కారణంగా మృతిచెందినవారి గుర్తుగా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంతో స్మారక స్థూపం నిర్మించారు. అత్యధికంగా దెబ్బతిన్న సొర్లగొంది గ్రామాన్ని జిల్లా పోలీస్‌శాఖ దత్తత తీసుకొని 1979లో పుననిర్మించింది. రామకృష్ణామిషన్‌ సభ్యులు కోడూరులోని గొల్లపాలెం పంచాయతీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆ గ్రామానికి రామకృష్ణాపురం అని నామకరణం చేశారు. పాలకాయతిప్ప గ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అభివృద్ధి పనులు చేపట్టింది.

ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు

● తుపాన్ల నుంచి తీరప్రాంతాల రక్షణకు దోహదపడే మడ అడవుల పెంపకంపై దృష్టి పెట్టాలి. తీరం వెంట మడ మొక్కలు నాటినా వాటిని సంరక్షించేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. కొంతమంది యథేచ్ఛగా మడ కర్రను నరికి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వీటిని నివారించి పూర్తిస్థాయిలో మడ పెంపకంపై దృష్టి పెట్టితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

● సముద్రం పోటు నీరు గ్రామాలోకి రాకుండా గతంలో నిర్మించిన అవుట్‌పాల్‌ స్లూయిస్‌లపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో స్లూయిస్ల గేట్లు మొత్తం తుప్పు పట్టి ఊడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాలకాయతిప్ప, సంగమేశ్వరం ప్రాంతాల్లో స్లూయిస్‌ శిఽథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని పుననిర్మిస్తే తుపాను బారి నుంచి తీరప్రాంతాల ప్రజలను రక్షించవచ్చు.

● కృష్ణా కరకట్ట అనేక చోట్ల ధ్వంసమైంది. ఉల్లిపాలెం హంసలదీవి ప్రాంతంలో కరకట్ట మూడొంతులు పైగా నదిలో కలిసిపోయింది. నిర్మాణ సమయంలో తగిన నాణ్యతా ప్రమాణాలు గురించి పట్టించుకోకపోవ డంతో నాగాయలంక నుంచి ఉల్లిపాలెం వరకు కట్ట భారీస్థాయిలో కోతకు గురైంది. ఇటీవల వచ్చిన కృష్ణా నదికి భారీగా వరదలు రావడంతో ఈ కరకట్ట మరింత బలహీనమైయింది. కట్ట ఎత్తు సైతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.

● తీరప్రాంత గ్రామాల్లో ఉప్పెన అనంతరం నిర్మించిన తుపాను రక్షిత భవనాలు చాలా చోట్ల శిథిలావస్థకు చేరాయి. వీటిని పుననిర్మిస్తే విపత్తు సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement