చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జి. గోపీచంద్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీకి సోమవారం ఆయన చాంబర్‌లో వినతిపత్రం అందజేశారు. గోపీచంద్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి భోజనం, తాగునీరు ఇతర అవసరాలకు పంచాయతీ కార్యదర్శులు తమ వ్యక్తిగత నిధులను ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల సిబ్బందికి విధుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు సజావుగా చేశారన్నారు. అలాగే ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల నిమిత్తం పోలింగ్ కేంద్రాలు పెరుగుతున్న నేపథ్యంలో కార్యదర్శులపై అధిక భారం పడే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణ నిధులు పంచాయతీ కార్యదర్శులకు మంజూరు చేయాలని ఆయన కోరారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏపీ జేఏసీ నాయకులు కృష్ణనాయక్, పి. రాధ తదితరులు పాల్గొన్నారు.


