సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): రాష్ట్రస్థాయి అండర్–19 హ్యాండ్ బాల్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాలురు, బాలికలు రెండు విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్లను అధిగమించి విజేతలుగా నిలిచారు. స్థానిక కేబీఎన్ కళాశాల వేదికగా ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్‌జిల్లాల అండర్–19 హ్యాండ్ బాల్ పోటీల్లో సంయుక్త జిల్లాలకు చెందిన 13 జట్లు పాల్గొన్నాయి. బాలురు, బాలికల విభాగాల్లో 210 మంది చొప్పున మొత్తం 420 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. లీగ్, నాకౌట్ పద్ధతిలో ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో కృష్ణా జిల్లా బాలికల జట్టు ఫైనల్‌లో శ్రీకాకుళం జట్టుపై 24–7 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. బాలుర విభాగంలోనూ కృష్ణా జిల్లా జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఫైనల్‌లో వైఎస్సార్ కడప జట్టును 16–9 గోల్స్ తేడాతో ఓడించి రాష్ట్రస్థాయి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
జాతీయ స్థాయికి ఎనిమిది మంది ఎంపిక..
రాష్ట్ర జట్టుకు కృష్ణా జిల్లా నుంచి బాలికల విభాగంలో ఏ. లావణ్య, పి. ప్రణతి, వి. శ్రీచాందిని, డి. సంజన ఎంపికయ్యారు. వీరు డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి అండర్–19 బాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే బాలుర విభాగంలో పి. గురుపార్థు, డి. హనుక్, టి. యశ్వంత్ కుమార్, ఎం. తన్విత్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు పంజాబ్‌లోని లూథియానాలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్–19 కార్యదర్శి వి. రవికాంతి వెల్లడించారు.
విజేతలకు ఘన సత్కారం..
కేబీఎన్ కళాశాల వ్యాయామ విద్య విభాగాధిపతి డి. హేమచంద్రరావు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. ముగింపు, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ టి. శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేపీవీవీ హిందూ విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి, పోటీల అబ్జర్వర్ కె. అలివేలు మంగమ్మ, పి. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలురు, బాలికల విభాగాల్లో రాష్ట్ర చాంపియన్‌షిప్ కై వసం


