మంగినపూడి బీచ్‌లో బైక్‌ దొంగలు | - | Sakshi
Sakshi News home page

మంగినపూడి బీచ్‌లో బైక్‌ దొంగలు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

మంగినపూడి బీచ్‌లో బైక్‌ దొంగలు అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

పట్టుకుని దేహశుద్ధి చేసిన వాహనదారులు

కోనేరుసెంటర్‌: మచిలీపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన మంగినపూడి బీచ్‌లో బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. బైక్‌లు అపహరించి పరారవుతుండగా అనుమానం వచ్చిన వాహనదారులుతో పాటు స్థానికులు పలువురు వారిని వెంబడించి పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కార్తిక సోమవారం సందర్భంగా బీచ్‌కు వచ్చిన పర్యాటకులకు చెందిన మూడు ద్విచక్ర వాహనాలను (బైక్‌లను) గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. వాహనాలు కనిపించకపోవడంతో అప్రమత్తమైన వాహనదారులు వాహనాల కోసం గాలింపు చేపట్టారు. ప్రయోజనం లేకపోవటంతో కొంత మంది స్థానికుల సహాయంతో బీచ్‌కు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తుండగా దొంగిలించిన వాహనాలతో బందరు మండలం గోకవరం వైపు వెళుతున్న చోరులను వాహనదారులు గుర్తించి పట్టుకున్నారు. స్థానికుల సహాయంతో పట్టుకున్న దొంగలను బీచ్‌ మార్గంలోని బడ్డీల సెంటర్‌కు తీసుకవెళ్లి కరెంటు పోల్‌కు కట్టేసి దేహశుద్ధి చేశారు. వాహనాలు దొంగిలించిన వ్యక్తులు పెడన మండలం తోటమూల గ్రామానికి చెందిన వారిగా తెలుసుకుని బందరు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

జగ్గయ్యపేట అర్బన్‌: ద్విచక్ర వాహనం డిక్కీలో నుంచి నగదు చోరీ చేసిన ఘటనలో నిందితుడిని జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకొని నగదును రికవరీ చేశారు. సోమవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, పేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ఎస్‌ఐలతో కలసి చోరీ రికవరీ వివరాలను తెలిపారు.

సీసీ కెమెరాల ఆధారంతో..

జగ్గయ్యపేటకు చెందిన నాగరాజేశ్వరరావు ఓ ప్రైవేటు సంస్థలో కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌ 30వ తేదీన పేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్‌లో తన స్కూటర్‌ పార్క్‌ చేయగా.. దాని సీటు కింద డిక్కీలో ఉంచిన రూ. 4,62,590 చోరీ గురైందని పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై బృందాలను ఏర్పాటు చేసిన పేట సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని ఆధారం చేసుకొని నిందితులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకడైన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా, కొత్తగూడెం మండలం, ఊటై గ్రామానికి చెందిన 37 ఏళ్ల మేకల ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తం రూ. 4,62,590ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడైన మేకల రాజేష్‌ కూడా అదే గ్రామ వాసి అని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కాగా ఈ ఇద్దరూ మహారాష్ట్రలో కూడా ఇదే తరహా నేరాలు చేసి పలు మార్లు జైలుకు వెళ్లి, శిక్ష అనుభవించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి వంద శాతం సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన పేట సీఐ పి. వెంకటేశ్వర్లు, పేట, పెనుగంచిప్రోలు ఎస్‌ఐలు జి.రాజు, ఎంఎస్‌కే అర్జునను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement