మహిళ మృతిపై వీడని చిక్కుముడి | - | Sakshi
Sakshi News home page

మహిళ మృతిపై వీడని చిక్కుముడి

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

మహిళ మృతిపై వీడని చిక్కుముడి

పీఎం రిపోర్టు కోసం వేచి చూస్తున్న పోలీసులు మరోవైపు రాము కోసం గాలింపు చంపేసి పరారయ్యాడా అనే కోణంలో దర్యాప్తు

లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన పెదపులి పాకకు చెందిన పైడిశెట్టి ఎర్నమ్మ(35) మృతి కేసులో చిక్కుముడి వీడలేదు. కాగా ఎర్నమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, ఇంకా రిపోర్టు పోలీసుల చేతికి అందలేదు. అది వస్తే కానీ ఏదైనదీ నిర్దారించలేమని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాముతో ఎర్నమ్మకు పరిచయం ఉన్న విషయం తెలిసింది. కృష్ణలంక బస్టాండ్‌ సమీపంలో అతను తీసుకున్న లాడ్జి గదికే ఎర్నమ్మ ఈ నెల 11న మధ్యాహ్నం వెళ్లింది. ఆమె వెళ్లిన అరగంటలోనే రాము హడావుడిగా గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అంతేకాదు ఎర్నమ్మ స్కూటీ లాడ్జి ఎదురుగా ఉండగా, దానిపైనే వెళ్లి బస్టాండ్‌ సమీపంలో వదిలేశాడు. దీంతో ఆమెను హత్య చేసి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహం బాగా ఉబ్బిపోవడంతో అప్పుడు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు రాము కోసం కూడా శ్రీకాకుళం జిల్లాతో పాటు, నగరంలోనూ పోలీసులు గాలిస్తున్నారు. అతను దొరి కినా అసలు ఏమి జరిగిందనేది తేలే అవకాశం ఉంది.

అదును చూసి చంపేశాడా?

గతంలో ఎర్నమ్మ, రాము ఇద్దరూ నగరంలోని ఒకే వస్త్ర దుకాణంలో పనిచేసేవారు. అదే సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కాగా కొంతకాలం కిందట ఎర్నమ్మ అక్కడ పనిచేయడం మానేసి, ఎంజీ రోడ్డులోని మరో వస్త్ర దుకాణంలో చేరింది. ఇక్కడ మరో వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి రాము, ఎర్నమ్మ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఇటీవల పెనమలూరు పోలీసు స్టేషన్‌లో రాముపై ఎర్నమ్మ ఫిర్యాదు చేయగా, అక్కడ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మంచిగా మాట్లాడుకుందామని పిలిచి, చంపేసి పరారయ్యాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె భోజనం చేస్తున్న సమయంలో అదును చూసి పీక పిసికి చంపేసి ఉండవచ్చని, ఎలాంటి ఆయుధాలు ఉపయోగించిన ఆనవాళ్లు అక్కడ లభించలేదని అంటున్నారు. ఏదేమైనా పోస్టుమార్టం రిపోర్టు అయినా రావాలి, లేదా రాము పోలీసులకు దొరికితే కానీ అసలు నిజాలు వెళ్లడయ్యే అవకాశం ఉందంటున్నారు. పోలీసులు రాము కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement