● మూడు రోజుల క్రితం మహిళ అదృశ్యం ● సూర్యారావుపేట పీఎస్‌లో కేసు నమోదు ● సీసీ కెమెరాల ఆధారంగా కృష్ణలంక లాడ్జిలో శవం గుర్తింపు
కృష్ణలంక (విజయవాడతూర్పు): విజయవాడ కృష్ణలంక లాడ్జిలో శవంగా మారిన మహిళది హత్యా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకకు చెందిన పైడిశెట్టి ఎర్నమ్మ (37) విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ ఉమెన్‌గా, ఆమె భర్త సాంబయ్య గ్యాస్ డెలివరీ బాయ్. ఎర్నమ్మకు శ్రీకాకుళానికి చెందిన రాముతో పరిచయం ఉంది. బుధవారం షాపింగ్ మాల్‌కు డ్యూటీకి వచ్చిన ఆమె మధ్యాహ్నం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మాల్ నిర్వాహకులు ఆమె భర్త సాంబయ్యకు సమాచారం ఇచ్చారు. ఆమె ఆచూకీ లభించక పోవడంతో సూర్యారావుపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
రాము ఉన్న లాడ్జికి వెళ్లి..
ఎర్నమ్మకు పరిచయస్తుడైన రాము కృష్ణలంక బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఎర్నమ్మ తన ద్విచక్ర వాహనంపై ఆ గదికి వెళ్లింది. ఎర్నమ్మ లోపలే ఉండగా అర్ధగంట తర్వాత రాము గదికి తాళాలు వేసి ఆమె ద్వి చక్ర వాహనంపై వెళ్లి తిరిగి రాలేదు.
వెలుగు చూసిందిలా?
సూర్యారావుపేట పోలీసులు నగరంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఎంజీ రోడ్డు నుంచి కృష్ణలంక సర్వీసు రోడ్డులో ఓ లాడ్జి వద్దకు వెళ్లి ఆమె బండి పార్కింగ్ చేసి లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ లాడ్జిలో ఆ గదికి వెళ్లి చూడగా దుర్వాసన వచ్చింది. ఆ గది తలుపులు తీయగా, అచేతనంగా ఎర్నమ్మ పడి ఉంది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. బుధవారం మధ్యాహ్నం వెళ్లి మరణిస్తే శుక్రవారం మధ్యాహ్నం సూర్యారావుపేట పోలీసులు వచ్చే వరకూ లాడ్జి సిబ్బంది గుర్తించక పోవడం నిర్వహణ లోపాన్ని వెల్లడిస్తోంది.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఎర్నమ్మ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యారావుపేట సీఐ చవాన్ తెలిపారు. రూమ్‌కు వెళ్లిన తర్వాత హత్య చేసి, తాళం వేసి వెళ్లిపోయాడా? లేదా ఆత్మహత్యా ప్రయత్నం ఏమైనా చేసిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు.
వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఒకే ప్రశ్నపత్రాన్ని యథాతథంగా పునరావృతం చేయడం విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ తీరుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జనవరిలో నిర్వహించిన ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ పేపర్–2లో ఇచ్చిన ప్రశ్నలనే నవంబర్ పరీక్షలోనూ యథాతథంగా ఇవ్వడం, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వైద్య కళాశాలల్లో ఈ విషయం వెలుగులోకి రావడం పరీక్షల నిర్వహణ లోపాలను స్పష్టం చేస్తోందన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యలో అత్యున్నత స్థాయి అర్హతలను నిర్ణయించే పరీక్షల విశ్వసనీయతకే ఇటువంటి ఘటనలు మచ్చ తెస్తాయన్నారు. ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరిశీలన, ఆమోదం, పరీక్షల నిర్వహణలో బాధ్యత వహించిన అధికారులను గుర్తించాలన్నారు. ప్రాథమికంగా బాధ్యత ఉన్న వారిని విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు.


