విజయవాడలీగల్: సోనాలి రకం కోడిపిల్లలను సప్లయిచేసి, మళ్లీ వాటిని తానే కొనుగోలుచేసి డబ్బులు ఇస్తానని పలువురిని మోసం చేసిన కేసులో పసుపులేటి అంకుశం మూడు రోజుల కస్టడీ శుక్రవారం పూర్తైంది. దీంతో పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం 2వ అదనపు జిల్లా కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో పసుపులేటి అంకుశం ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్ పూర్తవ్వడంతో న్యాయమూర్తి ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన సాహితీవేత్త డాక్టర్ జీవీ పూర్ణచందును 2026 సంవత్సరానికి జ్ఞాన జ్యోతి విశిష్ట సేవా పురస్కారానికి ఎంపిక చేసినట్లు రచయితల సంఘం అధ్యక్షురాలు చిల్లర భవానీదేవి, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడైనా సాహిత్య రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో 19వ తేదీ నిర్వహించే సభలో నగదు, జ్ఞాపిక అందజేయనున్నారని పేర్కొన్నారు.


