కూటమికి ధరాఘాతం తప్పదు | - | Sakshi
Sakshi News home page

కూటమికి ధరాఘాతం తప్పదు

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

● నిత్యావసరాల ధరలే వారిని

పతనం చేస్తాయి

● ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ

మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులు

భవానీపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన మేయర్‌ అభ్యర్థి భాగ్యలక్ష్మి, అభ్యర్థులు పప్పుల రమణారెడ్డి, బండారి వసంతకుమారి

71వ డివిజన్‌ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అభ్యర్థి వల్లూరి పద్మజ తదితరులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ:/గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలను పతనం చేసేవి పెరిగిన బియ్యం, పప్పు, నూనెల ధరలేనని వైఎస్సార్‌ సీపీ మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులు అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడు అంటూ తప్పుడు ప్రచారం చేశారని, కూటమి ప్రభుత్వంలో ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ కార్పొరేషన్‌తో పాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మునిసిపాలిటీల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగింపు కావడంతో పెరిగిన ధరలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. రోడ్‌ షోలు నిర్వహించి సుడిగాలి పర్యటనలు చేశారు.

విజయవాడ నగర కార్పొరేషన్‌ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి రోడ్‌ షో నిర్వహించారు. కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఏ విధంగా సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోయాయో వివరిస్తూ ప్రచారం చేశారు. వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తే గతంలో మాదిరి అభివృద్ధి చేసి చూపుతామన్నారు. మేయర్‌తోపాటు నగరంలోని 86 డివిజన్లలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

జగ్గయ్యపేట పట్టణంలోని 9వ వార్డులో చైర్‌ పర్సన్‌ అభ్యర్థి హఫీజున్నీసా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఆమె వెంట ఇన్‌చార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు సతీమణి తన్నీరు సుధారాణి, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి వీర్ల రాంబాబు ప్రచారంలో పాల్గొన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలని కోరారు. వలంటీర్‌ వ్యవస్థ, సచివాలయాలు, నవరత్నాలు పథకాలు ఇలా ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే చేర్చిన ఘనత గత వైఎస్సార్‌ పీపీ ప్రభుత్వానిదేనన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మునిసిపల్‌ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

నందిగామ పట్టణంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం చివరి రోజు చైర్మన్‌ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు రోడ్‌ షో నిర్వహించారు. రైతు పేట సెంటర్‌లోని లక్ష్మీప్రసన్న థియేటర్‌ సెంటర్‌ నుంచి అనాసాగరం వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం రోడ్డు నుంచి మునిసిపల్‌ కార్యాలయం మీదుగా గాంధీ సెంటర్‌, అక్కడ నుంచి పాత బస్టాండ్‌ వైపుగా ర్యాలీ సాగింది. పార్టీ శ్రేణులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, వంగవీటి నరేంద్ర పాల్గొన్నారు.

కొండపల్లి మునిసిపాలిటీలో 25వ వార్డులో చైర్‌పర్సన్‌ అభ్యర్థి నల్లమోతు తేజస్వి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి వల్లభనేని పార్వతితో కలిసి ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో కొండపల్లి మునిసిపాలిటీలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు.

తిరువూరు పట్టణంలోని 5, 18వ వార్డులలో చైర్మన్‌ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ అభ్యర్థులు కొలికపోగు కృష్ణ, మోదుగు బేబీ షాలినిలతో కలసి నియోజకవర్గ ఇన్‌చార్జి నలగట్ల స్వామిదాసు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని స్వామిదాసు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement