ఎన్నికల నేపథ్యంలో నిషేధాజ్ఞలు
గప్చుప్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మునిసి ‘పోల్స్’కు సర్వం సిద్ధమైంది. గత వారం రోజులుగా విజయవాడ, మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్లు, పెడన, ఉయ్యూరు, కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు మునిసిపాలిటీలలో కొనసాగిన ప్రచార పర్వం ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో మైకుల మూగబోయాయి. ప్రచారానికి చివరిరోజు కావడంతో అన్ని చోట్ల అభ్యర్థులు భారీ ప్రచార ర్యాలీలు నిర్వహించారు. డప్పులు, తీన్మార్ వాయిద్యాలతో మోతమోగించారు.
ప్రలోభాలు షురూ..
ప్రచారం ముగియడంతో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న డివిజన్లలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులకు రూ.25లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఓట్లు కొనేందుకు అధిష్టానం నుంచి డబ్బులు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఒక్కో చోట ఓటుకు వెయ్యి నుంచి 15 వందల రూపాయల వరకూ పంచేందుకు కూటమి అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. మునిసిపాలిటీలలో కూడా అక్రమాలకు తెరలేపారు. పోలీసులను అడ్డం పెట్టుకుని డబ్బులు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నవంబరు 1 నుంచి 10 వరకూ బీఎన్ఎస్ఎస్ 2023 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న సమయంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకుమించి ఎక్కువ మంది జనం బహిరంగ ప్రదేశాలలో గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకుని తిరగరాదని పేర్కొన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ముగిసిన ప్రచారం.. రేపే మున్సిపల్ ఎన్నికలు


