లబ్బీపేట(విజయవాడతూర్పు): నార్కో టెర్రరిజం, అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ రాడికలైజేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో శుక్రవారం వందేమాతరం జాతీయ యువజన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, తమిళనాడులు ఒక్కో రాష్ట్రం నుంచి 25 మంది చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకే రవికృష్ణ ‘భారతదేశానికి మాదకద్రవ్యాల రూపంలో పెరుగుతున్న సవాళ్లు‘ అనే అంశంపై ప్రసంగించారు. డ్రగ్స్‌కు ధైర్యంగా ’నో’ చెప్పాలని, ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాల వ్యతిరేక యోథుడిగా మారాలని పిలుపునిచ్చారు. ఈగల్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి, సీఐ రవీంద్ర, ఎస్–జె సెంటర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఫాదర్ బి. బాలకుమార్, మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ ఉజ్వల్, ఎస్‌ఐ భవానీ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కె.జగన్మోహనరెడ్డి కుమార్తె కె.శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.14లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులను కలిసి సుమారు వందగ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఉపప్రధానార్చకులు బి. శంకరశాండిల్య అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు బహూకరించారు.
కోనేరుసెంటర్: విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఆన్‌లైన్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం, స్కిల్‌డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఉపకులపతి కూన రాంజీ సమక్షంలో రిజిష్ట్రార్ ఎన్.ఉష, స్కిల్ డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ముప్పళ్ల శ్రీకాంత్ పరస్పరం సంతకాలు చేశారు.


