లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామలోని 8వ వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన మహిళా వైద్యురాలిని టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసి, బలవంతంగా నామినేషన్ విత్‌డ్రా చేయించగా, ఇప్పటి వరకూ ఆమె ఆచూకీ తెలియడం లేదంటూ ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నగరంలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారిపోయిందనేందుకు కూటమి పాలనే నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నామినేషన్‌లు వేయకుండా అరాచకాలు చేశారని, చివరకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయాల్సి వచ్చిందన్నారు. ప్రజల ఓటు హక్కును కాలరాసే విధంగా టీడీపీ వికృత చేష్టలు చేస్తోందన్నారు.
ఆ మహిళ ఎక్కడ?
నందిగామ 8 వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన మహిళా వైద్యురాలు క్లినిక్‌లో ఉండగా టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారని, ఆమెతో బలవంతంగా నామినేషన్ విత్‌డ్రా చేయించిన తర్వాత ఇప్పటి వరకూ ఆమె ఆచూకీ తెలియడం లేదని ఎమ్మెల్సీ అరుణకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వార్డుకు మళ్లీ నామినేషన్‌లు స్వీకరించాలని ఎమ్మెల్సీ అరుణకుమార్ డిమాండ్ చేశారు.


