పారా
క్రీడాకారులకు
ప్రత్యేక శిక్షణ
● ఉత్కంఠభరితంగా కనోయింగ్, కయాకింగ్ ● జలక్రీడలతో శరీరానికి, మనసుకు వ్యాయామం ● విజయవాడ పున్నమిఘాట్ వద్ద ప్రత్యేక శిక్షణ ● చిన్నారులతోపాటు పారా క్రీడాకారులకూ తర్ఫీదు
అలలపై
కనోయింగ్, కయాకింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): అలలపై సయ్యాటలాడుతూ.. పడవల్లో దూసుకెళ్తూ.. చూడచక్కని విన్యాసాలతో ఉత్కంఠభరితంగా సాగే జల క్రీడలకు కృష్ణా నది వేదికగా మారింది. ప్రకృతితో మమేకమవుతూ క్రీడా నైపుణ్యాలను పెంచుకునేందుకు భవానీపురంలోని పున్నమి హోటల్ (బెరంపార్క్) వద్ద పున్నమిఘాట్ వేదికగా మారింది. ఇక్కడ కెనోయింగ్, కయాకింగ్ వంటి జలక్రీడల (వాటర్ స్పోర్ట్స్)కు శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులతో పాటు పారా క్రీడాకారులు సైతం ఈ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. ఉదయం, సాయంత్రం శిక్షణ పొందుతున్న చిన్నారులు జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంత మంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.
కెనోయింగ్ వేగం.. కచ్చితత్వం.. నియంత్రణ
కయాకింగ్ అనేది నీటిపై నిర్వహించే ఉత్కంఠభరితమైన జలక్రీడ. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసి తక్కువ బరువుగల ప్రత్యేక చిన్న పడవే కయాక్. దీని పైభాగం మూసివుంటుంది. క్రీడాకారులు పడవ కిందిభాగంలో కాళ్లుచాపి కూర్చుని రెండు వైపులా బ్లేడులు కలిగిన తెడ్డును ఉపయోగిస్తూ నీటిపై దూసుకెళ్తారు. ఒకరు, ఇద్దరు, నలుగురు కూర్చునే బోట్లు ఉంటాయి. 12 మంది క్రీడాకారులు కూర్చునే బోట్‌ను డ్రాగన్ అంటారు. ఈ క్రీడకు సంబంధించిన ప్రతి ఈవెంట్ (స్టాండప్ పెడలింగ్, ర్యాప్టింగ్ పెడలింగ్)కు ప్రత్యేక బోట్లు, నిబంధనలు ఉంటాయి. వేగం, శరీర సమతుల్యత, ఏకాగ్రత, సమన్వయం ఈ క్రీడలో అత్యంత కీలకం. కయాకింగ్‌లో పలు విభాగాలు ఉన్నాయి. వాటిల్లో కయాక్ స్ప్రింట్, కయాక్ స్లాలమ్, మారథాన్, వైల్డ్ వాటర్, సీ కయాకింగ్ వంటి ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. స్ప్రింట్, స్లాలమ్ విభాగాలు ఒలింపిక్స్ క్రీడల్లో ఉన్నాయి. ఒక్కో విభాగంలో పోటీ విధానం, నీటి పరిస్థితులు, నిర్ణీత మార్గం, దూరం తదితర అంశాలు మారుతూ ఉంటాయి. స్ప్రింట్ విభాగంలో నిర్ణీత దూరాన్ని వేగంగా పూర్తి చేయాలి. స్లాలమ్ విభాగంలో నీటిపై ఏర్పాటు చేసిన గేట్లను సరైన క్రమంలో దాటుతూ నిర్ణీత మార్గాన్ని పూర్తి చేయాలి. వేగంతోపాటు కచ్చితత్వం, నియంత్రణ ఈ విభాగంలో కీలకం. నిబంధనలను ఉల్లంఘిస్తే పెనాల్టీ విధించే అవకాశం ఉంది. మారథాన్ కయాకింగ్‌లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉన్నందున శరీర సామర్థ్యం ముఖ్యం. కెనోయింగ్ కూడా తేలికపాటి పడవే. దీని పైభాగం తెరిచివుంటుంది. క్రీడాకారులు మోకాళ్లపై లేదా ఎత్తయిన సీటుపై కూర్చుని ఒకవైపే బ్లేడ్ ఉన్న తెడ్డు వాడతారు.
శరీరానికి, మనసుకు వ్యాయామం
కయాకింగ్ జలక్రీడ సంపూర్ణ వ్యాయామంలా పని చేస్తుంది. తెడ్డును ఉపయోగించడం ద్వారా చేతులు, భుజాలు, ఛాతీ, వెన్ను, కోర్ కండరాలు చురుగ్గా పని చేస్తాయి. క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం ద్వారా శారీరక ధృడత్వం, సామర్థ్యం, శరీర సమన్వయం మెరుగుపడతాయి. నీటిపై కయాక్ (బోట్)ను నియంత్రించేందుకు ఏకాగ్రత, సమతుల్యత అవసరం. ఈ శిక్షణతో పిల్లలో ఆత్మ విశ్వాసం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. క్రమశిక్షణతో శిక్షణ తీసుకోవడం వల్ల సమ యపాలన, పట్టుదల, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. చదువుతోపాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలనుకునే పిల్లలకు కయాకింగ్ మంచి అవకాశాన్ని అందిస్తుంది.
కెనో అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం నాయుడు, వ్యవస్థాపకుడు శివారెడ్డి మార్గదర్శకత్వంలో కయాకింగ్ కోచ్‌లు వి.చిన్న బాబు, ఎం.శ్రీను, సీహెచ్.తేజ శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పోటీ స్థాయి వరకు క్రీడాకారుల సామ ర్థ్యానిబట్టి శిక్షణ ఇస్తున్నారు. నీటిలో కయాక్‌ను ఎలా సమన్వయం చేయాలి, తెడ్డును ఏ విధంగా ఉపయోగించాలి, వేగాన్ని ఎలా పెంచాలి, మలుపులను ఎలా నియంత్రించాలి వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కోచ్‌ల శిక్షణలో నేషనల్స్‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గాయత్రి (గోల్డ్), చేతన భగవతి(బ్రాంజ్) పతకాలు సాధించటం విశేషం. శిక్షణ తీసుకునేవారికి అవసరమైన మౌలిక వసతులు, ప్రోత్సాహం అందిస్తే విజయవాడ నుంచి మరింత మంది కయాకింగ్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని కోచ్ చిన్న బాబు తెలిపారు.
భవానీపురం పున్నమిఘాట్ వద్ద జరుగుతున్న శిక్షణలో సాధారణ పిల్లలతోపాటు పారా క్రీడాకారులకుకూడా అవకాశం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పారా బోట్స్ ద్వారా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న తాము నేషనల్స్‌కు వెళితే ఇండియా తరఫున మెడల్స్ తీసుకొస్తామన్న ఆత్మవిశ్వాసం ఉందని, అయితే అక్కడికి వెళ్లేందుకు రూ.లక్ష ఖర్చవుతుందని, ఆ మొత్తం భరించే దాత కోసం ఎదురు చూస్తున్నామని పారా క్రీడాకారుడు బాబూరావు తెలిపారు.


