మీ భూమి – బ్లాక్‌ చెయిన్‌తో భూ రికార్డులకు శాశ్వత భద్రత | - | Sakshi
Sakshi News home page

మీ భూమి – బ్లాక్‌ చెయిన్‌తో భూ రికార్డులకు శాశ్వత భద్రత

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

గన్నవరం: మీ భూమి – బ్లాక్‌ చెయిన్‌ వ్యవస్థ ద్వారా భూముల రికార్డులకు శాశ్వత భద్రత లభిస్తుందని ప్రభుత్వ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ), ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి తెలిపారు. జిల్లాలో మీ భూమి – బ్లాక్‌ చెయిన్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికై న గన్నవరం మండలంలోని భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను స్థానిక సబ్‌రిజి స్ట్రార్‌ కార్యాలయాన్ని శనివారం ఆమె పరిశీలించారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో రీసర్వే పూర్తయిన ఏడు మండలాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామన్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ శాఖల రికార్డులను బ్లాక్‌ చెయిన్‌ వ్యవస్థకు అనుసంధానం చేసి, భూమి ఎల్‌పీ నంబర్‌ ఆధారంగా డిజిటల్‌ ఐడీ కేటాయిస్తామన్నారు. సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి–1 చేతన్‌ టీఎస్‌, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ విజయవాడ, గుంటూరు ఐజీలు కె.రామారావు, జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రర్‌ ఎం.ఎస్‌.జి.కె.మూర్తి, తహసీల్దారు కె.వెంకటశివయ్య, సబ్‌రిజిస్ట్రార్‌ వి.వి.వి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయ పాల సేకరణ ధర పెంపు

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) పాల సేకరణ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డెయిరీ పాలకవర్గ సమావేశం శనివారం పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్‌ హాల్‌లో జరిగింది. తాత్కాలిక చైర్మన్‌గా దాసరి వెంకట బాలవర్ధనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, పాల సేకరణ, డెయిరీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. డెయిరీకి పాలు పోసే రైతులకు ధర పెంచుతూ బోర్డు సమావేశం నిర్ణయించింది. గెదే పాలు లీటర్‌కు రూ.3, ఆవు పాలకు రూ.3.50 నుంచి రూ.4 వరకు పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. పాల సేకరణ ధర ప్రస్తుతం రూ.85గ ఉండగా, పెరిగిన ధరతో రూ.88కు చేరింది. ఆవు పాల ధర రూ.25 నుంచి రూ.29కు పెరిగింది. లక్షన్నర మంది రైతులు ప్రయోజనం చేకూరనుంది.

పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): పచ్చదనం, పరిశుభ్రతతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా శని వారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ రాజశేఖరబాబు, డీసీపీ కె.జి.వి.సరిత మొక్కలు నాటారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణం అందించడానికి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని కోరారు. పోలీస్‌ శాఖ తరఫున శాంతిభద్రతలతో పాటు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వామ్యం కావాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీసీపీ బి.సత్యనారాయణ, ఏడీసీపీ ఎన్‌.వి.రమణ, ఏఆర్‌ ఏసీపీ రామకృష్ణంరాజు ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

వాణిజ్య పన్నుల శాఖలో ముగ్గురు డిస్‌మిస్‌

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులపై ప్రభుత్వం శనివారం వేటు వేసింది. డెప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.వి.చలపతి, జీఎస్టీఓ బి.మెహర్‌కుమార్‌ను డిస్‌మిస్‌ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌కుమార్‌ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ శాఖ విచారణ చేపట్టింది. ఆరుగురిపై ఆరోపణలు రుజువైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురిని డిస్‌మిస్‌ చేస్తూ జీఓలు విడుదలయ్యాయి. అయితే జీఓల్లో ఎక్కడా అవినీతి ఆరోపణలను వివరించలేదు. మిగిలిన ముగ్గురికి ఇంక్రిమెంట్‌లు కట్‌ చేసినట్లు తెలిసింది. వారి డిస్‌మిస్‌ వ్యవహారంపై ఏపీపీఎస్సీ అభిప్రాయాన్ని తీసుకున్నట్లుగా జీఓల్లో పేర్కొన్నారు. డిస్‌మిస్‌ ఉత్తర్వులు విడుదల కాగానే ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. ఈ ముగ్గురు అధికారులు ప్రతినిధ్యం వహిస్తున్న సంఘం ఇటీవల ఆ శాఖ కమిషనర్‌పై అవినీతి ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకే సామాజికవర్గానికి చెందిన వారిపై వేటు పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement