మధురానగర్(విజయవాడసెంట్రల్): విభిన్న ప్రతిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు దోహదపడతాయని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో 58 మంది దివ్యాంగులకు శనివారం రూ.66.70 లక్షల విలువైన స్కూటర్లు పంపిణీ చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 113 దరఖా స్తులు అందగా జిల్లా ఎంపిక కమిటీ ప్రభుత్వ మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల మేరకు దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వాడ్రేవు కామరాజు తదితరులు పాల్గొన్నారు.


