కాలకూట నీరు.. జనానికి కన్నీరు | - | Sakshi
Sakshi News home page

కాలకూట నీరు.. జనానికి కన్నీరు

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

ప్రభుత్వ పరువు పోతుందని..

ఉమ్మడి జిల్లాలో ఆగని డయేరియా!

రెండేళ్లలో వందలాదిగా కేసులు

ఇప్పటికీ పట్టించుకోనిప్రభుత్వం, అధికారులు

నివేదికలను బయటపెట్టని వైనం

పట్టించుకోవడం లేదు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. వ్యాధి ప్రబలడానికి కలుషిత నీరే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైపులైన్లు కలుషితమై, కాలకూట విషాన్ని తాగుతున్నామని చెబుతున్నారు. అయితే కలుషిత ఆహారం కారణం కావొచ్చంటూ బాధితులపైనే అధికారులు నెపం నెట్టేస్తున్నారు. నీటి నమూనాలు సేకరించి ల్యాబులకు పంపిస్తున్నారు. ఆ ఫలితాల నివేదికలను బయట పెట్టకుండా తొక్కిపెడుతున్నారు. రెండురోజుల్లో కృష్ణాజిల్లా కంకిపాడు, సమీప గ్రామాల్లో 40 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. శనివారం కొత్త కేసులు లేవని వైద్యాధికారులు ప్రకటించారు. అయితే వైద్య శిబిరాన్ని సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌కు మాత్రం ఇంటింటి సర్వేలో రెండు కేసులను గుర్తించి, వారిని వైద్యం కోసం సీహెచ్‌సీకి తరలించామని చెప్పారు. ఇప్పటికీ సీహెచ్‌సీలో 15 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు. గత వారంలో ఉయ్యూరులో అధికారికంగా 35 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య 60కి పైనే ఉండొచ్చని అంచనా. ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరందరూ వేర్వేరు అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని, డయేరియా మరణాలు కాదంటూ అధికారులు సాకులు చెప్పారు.

క్లోరినేషన్‌ చేశాక నీటి పరీక్షలు

డయేరియాకు తాగునీరు కలుషితం కారణ మని జనం ఆరోపిస్తుంటే, ఆహార పదార్థాల వల్ల అంటూ అధికారులు తప్పుకొంటున్నారు. తాము చేయించిన తాగునీటి పరీక్షలు సాధారణంగానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే సూపర్‌ క్లోరినేషన్‌, మరమ్మతులు చేసిన తర్వాత వచ్చిన రిపోర్టులను అధికారులు చూపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వందలాది మంది డయేరియా బారిన పడ్డారు.

నాడు న్యూ ఆర్‌ఆర్‌పేటలో 300 మంది..

గత ఏడాది సెప్టెంబర్‌ రెండో వారంలో విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయే రియా బారిన పడ్డారు. దాదాపు వారం రోజుల పాటు ఆ ప్రాంతంలో డయేరియా కేసులు వచ్చాయి. తొలుత వినాయకుడి ఊరేగింపు తర్వాత చేసిన భోజనం కారణంగా అతిసార సోకి నట్లు అధికారులు చెప్పగా, వారం రోజుల పాటు కొత్త కేసులు వస్తూనే ఉండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కుళాయిల్లో కలుషిత నీరు రావడం వలనే డయేరియా సోకిందని స్థానికులు చెప్పినా అధికారులు తమ నీటి పరీక్షల్లో అదేమీ లేదని కొట్టిపారేశారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి నీరు తీసుకొచ్చి దాదాపు 20 రోజుల పాటు సరఫరా చేశారు. వందల మంది ఆస్పత్రి పాలవడానికి కచ్చితమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది జూలైలో గిరిపురం 30 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే కుళాయిల నీరు కలుషితమైందని, అందుకే తాము వ్యాధి బారిన పడ్డామని స్థానికులు ఆరోపించారు.

గత ఏడాది జూలైలో ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభించింది. దాదాపు 15 మంది డయేరియా బారిన పడ్డారు. వారందరూ విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిల్లో చికిత్స పొందారు. పెనుగంచిప్రోలు మండటం గుమ్మడిదుర్రు గ్రామంలో సైతం జూలైలో పది మందికి డయేరియా సోకింది. షేర్‌ మహమ్మద్‌పేటలో విష జ్వరాలు, డయేరియా విజృంభిం చింది. అపరిశుభ్ర పరిసరాలే కారణ మంటూ అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది విస్సన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 20 మందికి డయేరియా సోకగా, అక్కడ వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మాత్రం ఆయా గ్రామాల్లో డయేరియాకు కచ్చితమైన కారణాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదు. తాము సరఫరా చేసిన నీరు కలుషితమని చెబితే ప్రభుత్వ పరువు పోతుందని ఈ రిపోర్టులు బయట పెట్టలేదనే విమర్శలు వినిపించాయి.

వైద్య సిబ్బంది ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఒక మందు బిళ్ల, ఒక ఇంజక్షన్‌ ఇచ్చి వెళ్లి కబుర్లు చెప్పుకొంటున్నారు. రోగులు ఏమయ్యారు అనేది అవసరం లేదు వాళ్లకి. బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం.

– ఇంద్రాణి, పునాదిపాడు,

కంకిపాడు మండలం

వైద్య సేవల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే డయేరియా కారణంగా ఉయ్యూరులో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు కంకిపాడుకు విస్తరించింది. అయినా అధికారుల్లో చలనం లేదు. పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరో ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటర్‌ ప్లాంట్‌ ట్యాంకులను నిరంతరం శుభ్రం చేస్తూ ప్రజలకు సురక్షిత తాగు నీరు అందిం చాలి. కృష్ణా జలాలను తీసుకొస్తున్నా మంటూ ప్రచారంలో ఊదరగొడుతున్న పాలకులు ప్రజారోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.

– దేవభక్తుని చక్రవర్తి, వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, పెనమలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement