చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలకు అత్యవసర సమయాల్లో అండగా నిలిచేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తృతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. గత ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యకలాపాల నివేదిక, ఆదాయ, వ్యయ వివరాలను సమావేశంలో వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రెడ్‌క్రాస్‌కు లభించిన అవార్డు సంస్థ లోని ప్రతి సభ్యుడు, వలంటీర్ సమష్టి కృషికి గుర్తింపని పేర్కొన్నారు. కళాశాలల్లో యూత్ రెడ్‌క్రాస్, ఉన్నత పాఠశాలల్లో జూనియర్ రెడ్‌క్రాస్‌ను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. జూనియర్ రెడ్‌క్రాస్ ఏర్పాటు, ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై పీఈటీలకు శిక్షణ ఇచ్చేందుకు డివిజన్ల వారీగా వర్క్‌షాపు నిర్వహించాలన్నారు. మచిలీపట్నంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం పక్కన, చల్లపల్లి సబ్ బ్రాంచ్ రెడ్‌క్రాస్‌కు భూమి కేటాయింపునకు చర్యలు చేపట్టాలన్నారు. బ్లడ్ బ్యాంక్‌కు అవసరమైన పరికరాలను సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఎన్‌హెచ్‌పీసీల నుంచి సమకూర్చేందుకు ఎంపీ సహకరించనున్నట్లు సమావేశంలో వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు మండలాల వారీగా షెడ్యూలు రూపొందించి విడుదల చేయాలన్నారు. అనంతరం రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలకు విశేషంగా సహకరించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్వో ఎస్.పోతురాజు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డి.ఆర్.కె.ప్రసాద్, కార్యదర్శి భవిరి శంకర్‌నాథ్, కోశాధికారి పడమట సుకుమార్, డీఈవో యు.వి.సుబ్బారావు, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ


