విజయవాడలీగల్: న్యాయవాదుల సహకారంతోనే కక్షిదారులకు సత్వర న్యాయం సాధ్య మని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యామిని శనివారం తొలిసారిగా విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్‌కు విచ్చేసి న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో తాను విజయవాడలో న్యాయాధికారిగా పనిచేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పని చేస్తేనే సత్వర న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు. బీబీఏ అధ్యక్షుడు విష్ణు భొట్ల లక్ష్మీనారాయణ విజయవాడ న్యాయ స్థానం సముదాయంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. బీబీఏ కార్యవర్గ సభ్యులు ఇస్సాంశెట్టి ఉషాజ్యోతి, వేములపల్లి పద్మజ, రామతేజ, ఎం.శ్రీకాంత్ తదితరులు న్యాయమూర్తికి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ కుమార్, రాగి గంగాభవాని, ఎం. జైకర్, తగరం కిరణ్ బాబు, వీబీఏ మీడియా కమిటీ చైర్మన్ విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని


