‘సర్‌’ నోటీసులతో ఆందోళన చెందొద్దు | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ నోటీసులతో ఆందోళన చెందొద్దు

Aug 23 2026 5:32 AM | Updated on Aug 23 2026 5:32 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. నోటీసుకు సంబంధించి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, విచారించి, అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి హాలులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను ఈ సందర్భంగా నివృత్తి చేశారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. నోటీసు రావడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని, దానిని అందుకున్న వారు నిర్ణీత గడువు లోగా తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలను సమర్పించి తమ అభ్యంతరాలను తెలపొచ్చని సూచించారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈఆర్‌ఓ స్థాయిలోనూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు.

జిల్లాలో 1,85,718 నోటీసులు

జిల్లాలో ఇప్పటి వరకు 1,85,718 నోటీసుల పంపిణీ చేశా మని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. వీటిలో 32,996 మంది విచారణ పూర్తయిందన్నారు. 69,717 మందికి విచారణ షెడ్యూలు గడువు ముగిసిన నేపథ్యంలో విచారణ కోసం రీషెడ్యూల్‌ చేస్తాన్నారు. ఈ నెల 22తో పాటు పాటు 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరికి ఏ సందేహం వచ్చినా క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు సహాయ, సహకారాలకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా ఓటు నమోదుకు వీలుకల్పించే ఫారం–6తో పాటు ఫారం–7, ఫారం–8 కూడా వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement