మొగల్రాజపురం(విజయవాడతూర్పు): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆదివారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ అండ్ హెచ్‌ఆర్ విభాగం డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి ఉద్యోగులను ఆదేశించారు. నగరంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. పరీక్ష నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా ఎస్‌ఈ హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ప్రసాద్, కొండలరావు, పలువురు అసి స్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
27న వ్యవసాయ పాలిటెక్నిక్ స్పాట్ కౌన్సెలింగ్
ఘంటసాల: స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్ కళా శాలలో చేరేందుకు ఈ నెల 27వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సత్య ప్రియలలిత తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె శనివారం మాట్లాడుతూ.. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన, ఇంటర్ ఫెయిల్ అయినా లేదా మధ్యలో ఆపివేసిన వారు రెండు సంవ త్సరాల వ్యవధి కలిగిన వ్యవసాయ డిప్లొమో కోర్సులు చదివేందుకు అవకాశం ఉందన్నారు. ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నమోదు చేసుకున్న, గతంలో నమోదు చేసుకోని అభ్యర్థుల కోసం ఈ నెల 27న గుంటూరు సమీపంలోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మ్యానువల్‌గా స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. వివరాల కోసం 08671–254499 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.


