విమానాశ్రయం(గన్నవరం): ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా పట్టిష్ట భద్రత, ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధి కారులకు కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, ఎస్పీజీ అధికారులతో కలిసి విమానాశ్రయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ముసునూరు మండలం పుసునూరు గ్రామంలో జరిగే కార్యక్రమానికి వెళ్లి వస్తారని ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్ తెలిపారు. కాన్వాయ్ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కీలక ప్రాంతాల్లో బందో బస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయంలో కంట్రోల్ రూమ్, గ్రీన్ రూమ్, వీఐపీ రిసెప్షన్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీ కాంతరెడ్డి, సీఎస్‌ఓ కె.ధర్మేంద్ర, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


