కొనసాగిన జూనియర్ డాక్టర్ల సమ్మె ఆందోళనలో భాగంగా జీజీహెచ్‌లో రిలే దీక్షలు 15లోపు స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం
ప్రత్యామ్నాయం చూస్తున్నాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘మా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే, మీకు సమ్మె చేసే హక్కు ఎవరిచ్చారు. ఎస్మా ప్రయోగిస్తాం’ అని ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవ హరించడంపై జూనియర్ డాక్టర్లు (జూడా)మండిపడుతున్నారు. కనీసం ఆస్పత్రుల్లో మహిళా పీజీలు, హౌస్‌సర్జన్లకు సరైన టాయిలెట్లు లేక, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌లకు గురవుతున్నారని చెబితే, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు ఇంతేనని ఉన్నతాధికారులు మట్లాడటంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ నెల 15వ తేదీ లోపు స్పందించకుంటే, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అత్యసవర సేవలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. జనవరి నుంచి పెంచాల్సిన స్టైపెండ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచవద్దంటూ ఏపీ జూడా పిలుపు మేరకు ఎస్‌ఎంసీ జూడా ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బుధవారం జీజీహెచ్ ప్రాంగణంలో రిలే దీక్షలు చేపట్టారు. 300 మంది విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో క్యాజువాలిటీ, ఐసీయూలు, పీఐసీయూ, లేబర్ వార్డు, ఎమర్జెన్సీ సర్జరీ విధులకు మాత్రమే జూడాలు హాజరవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించి మహిళా హౌస్‌సర్జన్ల, పీజీలకు సరైన వాష్‌రూములు లేవని, టాయిలెట్లలో నీరు రాని పరిస్థితులు ఉన్నాయని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర వాష్‌రూమ్స్ వినియోగించి యూరిన్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడిన వారు ఉన్నారని, ఇదే విషయాన్ని ప్రభుత్వ చర్చల్లో ప్రస్తావిస్తే ‘ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాగే ఉంటాయి. మీరు చేరే ముందు తెలియదా?’ అని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
జూడాల సమ్మెకు జీడీఏ ఏపీ మద్దతు
జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్ (జీడీఏ ఏపీ) అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఐ.బాబ్జీ శ్యామ్‌కుమార్, డాక్టర్ స్వరూప్ కాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. జూడాలు తమ మద్దతు కోరారని పేర్కొన్నారు. ఇతర సభ్యులతో చర్చించి వారికి మద్దతు తెలిపామని వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి పరిష్కరించాలని కోరారు.
జూడాలు సాధారణ విధులు బహిష్కరించడంతో రోగులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయం చూస్తున్నాం. వైద్య కళాశాలలోని 17 మంది ట్యూటర్లను తీసుకున్నాం. మరో ముగ్గురు డీసీహెచ్‌ఎస్ నుంచి వచ్చారు. డీఎంహెచ్‌ఓ నుంచి కూడా పంపమని అడిగాం. మా వద్ద 50 మంది సర్వీసు పీజీలు ఉన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నాం.
– డాక్టర్ రఘునందన్,
సూపరింటెండెంట్, జీజీహెచ్


