అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎమ్మెల్యే చెప్పు చేతల్లో ఖాకీలు నడుస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ మరో ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో పాటు 12 మందిపై కేసులు నమోదు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్యలు కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అజిత్ సింగ్‌నగర్ ఆంధ్రప్రభకాలనీలో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిబంధలను అతిక్రమించి రోడ్లపైకి వచ్చి దగా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపిస్తూ అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన వృద్ధుడు షేక్ కబీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లాది విష్ణు, అవుతు శ్రీశైలజ, మాజీ కార్పొరేటర్లు బీహెచ్‌ఎస్వీ జానారెడ్డి, నందెపు జగదీష్, పార్టీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, శ్రీరాములు, గుండె సుందర్‌పాల్, అలంపూరు విజయ్, మాతా మహేష్, మేడా రమేష్, త్రివేణిరెడ్డి, వరలక్ష్మిపై 126(2), 223, రెడ్‌విత్ 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్–2 ప్రకారం కేసులు నమోదు చేశారు.
కార్యక్రమానికి హాజరుకాని వారిపైనా కేసులు
అజిత్‌సింగ్‌నగర్, నున్న, సత్యనారాయణపురంస్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బంది వచ్చి వైఎస్సార్ సీపీ నాయకుల ర్యాలీని అడ్డుకున్నారు. ఆ సమయంలో తమ ఫోన్‌లతో పాటు డ్రోన్‌లతో ర్యాలీని వీడియో తీశారు. అయినా కార్యక్రమానికి హాజరుకాని వారిపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది మారింది. కక్షపూరితంగా ఎమ్మెల్యే చెప్పిన వారిపై పోలీసులు గుడ్డిగా కేసులు నమోదు చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ర్యాలీ నిర్వహణపై కేసులు నమోదు
జి.కొండూరు: రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు జి.కొండూరులో సోమవారం నిర్వహించిన ర్యాలీకి అనుమతులు లేవంటూ ముందుగా ముఖ్య నాయకులకు పోలీ సులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహణ అనంతరం మైలవరం నియోజకవర్గానికి చెందిన 35 మంది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై మంగళవారం రాత్రి జి.కొండూరు పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గ్గుచేటని మండిపడుతున్నాయి.


