శీల పరీక్షలో నెగ్గేందుకే దాడి..
ఇది ప్రజాస్వామ్యంపై దాడి..
సీబీఐ ఎంకై ్వరీ వేయాలి..
పచ్చ కార్యకర్తల్లా పోలీసులు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి..
దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలోకి చొరబడి, వేలు చూపిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా
సాక్షిప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: విజయవాడలో రౌడీరాజ్యం నడుస్తోంది. శాంతి యుతంగా నిరసన దీక్షలు చేస్తున్న వారిపై దాడి చేసి కొత్త సంస్కృతికి తెరలేపారు. ఈ దాడుల్లో ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంపై టీడీపీ గూండాలు దాడికి దిగారు.
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేరుగా కార్యకర్తలతో దీక్షా శిబిరం వద్దకు చేరుకుని దాడికి పాల్పడ్డారు. ఆయనే స్వయంగా షామియానా పీకేయడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. శిబిరంలో దీక్షకు కూర్చున్న మల్లాది విష్ణుతో పాటు కార్యకర్తలపై కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. కార్యకర్తలు, నాయకులపై కుర్చీలు విసిరారు. దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. శిబిరంపై దాడిచేస్తున్న సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా అక్కడే ఉండి కార్యకర్తలను రెచ్చగొట్టారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి శిబిరంపై దాడి చేస్తున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. దాడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులను వదిలివేసి.. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను చెల్లా చెదురు చేసేందుకు ప్రయత్నించారు. కొంత మంది కార్యకర్తలను శిబిరం నుంచి లాగిపడేశారు. శిబిరం వైపు దూసుకువస్తున్నా.. వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదు. శాంతియుతంగా నిరాహార దీక్షలో కూర్చున్న మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. వాహనంలో ఎక్కిన తర్వాత కూడా పోలీసు సిబ్బంది ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అక్కడ నుంచి మల్లాది విష్ణును అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌కు తరలించారు. అక్కడ వాహనంలోనే కూర్చుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ కార్యకర్తల దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడిని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, ఎండీ రుహుల్లా, మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, అవుతు శ్రీనివాసరెడ్డి, బండి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్, ఎండీ గౌస్ మొహిద్దీన్ తీవ్రంగా ఖండించారు.
వైఎస్సార్ సీపీ నిరాహార దీక్షా శిబిరంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే. ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పాల్గొని దాడికి ఉసిగొల్పిన సంఘటనలు విజయవాడలో ఇదే ప్రథమం. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న బ్రాహ్మణ సంఘం నాయకుడైన మల్లాది విష్ణుపై పోలీసులు సమక్షంలోనే గుడ్లు, మూత్రంతో దాడి చేయడం దారుణం. బ్రాహ్మణ సమాజానికి బొండా ఉమా క్షమాపణలు చెప్పాలి.
– మొండితోక అరుణకుమార్, ఎమ్మెల్సీ
మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలన్నీ బయటకు రావాలి. రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మార్జిన్లు పెట్టుకుని దందా చేశారనే ప్రచారంపై స్పందించాలి. దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి లోకేష్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి.. వైఎస్ జగన్ చెప్పిన పిన్–టు–పిన్ పాయింట్లపై విద్యార్థులతో ముఖాముఖి చర్చించాలి. – రవిచంద్ర, పార్టీ
విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఎమ్మెల్యే బొండా ఉమా శీల పరీక్షలో నెగ్గేందుకు మల్లాదిపై దాడి చేశారు. టీడీపీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఉమా చిట్టా అంతా చంద్రబాబు ముందు పెట్టారు. తాను టీడీపీలోనే ఉన్నానని నిరూపించుకునేందుకు ఇలాంటి చేతగాని పనులు చేస్తున్నారు. దమ్ముంటే మేం అడుగుతున్న డీఎస్సీ అక్రమాలపై మాట్లాడాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి, నిరుద్యోగ భృతి అమలు చేయాలి. వీటికి సమాధానం చెప్పడం లేదు. వందలమందిని తీసుకొచ్చి, మందు పోయించి దాడి చేయిస్తే ఏమవుతుంది? అన్ని రోజులూ మీవీ కావు. – దేవినేని అవినాష్, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు
రిలే నిరాహార దీక్షపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, టీడీపీ నియోజకవర్గ గ్యాంగ్ ముందస్తు ప్రణాళికతో దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్ని అనుమతులతో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, రక్షణగా ఉండాల్సిన పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తోసేసి టీడీపీ శ్రేణులకు కొమ్ముకాస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసులు ఖాకీ డ్రెస్సులు వేసుకోలేదు.. పచ్చ చొక్కాలు తొడుక్కుని పనిచేస్తున్నారు. – అవుతు శ్రీశైలజారెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లక్ష్యంగా కోడిగుడ్లతో దాడికి దిగడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. ప్రభుత్వ హామీలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ఈ భౌతిక దాడులు చేస్తున్నారు. యువత, విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్ సీపీ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే రౌడీయిజం చేయడం సరికాదు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి. వైఎస్సార్ సీపీ నేతలపై భౌతిక దాడులు చేస్తూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడుపుతున్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.
– వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి


