భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.257 కోట్లు మంజూరు చేయాలని వార్షిక ప్రణాళిక కింద నేషన్ ఆయుష్ మిషన్‌కు ప్రతిపాదన పంపామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని, సిద్ద వైద్యులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లతో గుంటూరు సమీపంలో కేంద్ర యోగ, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించిందని తెలిపారు. తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరం ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.15 కోట్ల చొప్పున వ్యయం చేసి ఆయుష్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ధర్మవరం, పిఠాపురం ప్రాంతాల్లో ఆయుర్వేదం, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.70 కోట్లు చొప్పున రూ.210 కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. అలాగే విశాఖలో రూ.70కోట్లతో తలపెట్టిన నేచురోపతి వైద్య కళాశాల నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, రోణంకి గోపాలకృష్ణ, కేంద్ర ప్రభుత్వ హోమి యోపతి సలహాదారు డాక్టర్ ప్రీతా కిజక్కుట్టిల్, ఆయుష్ అదనపు డైరెక్టర్లు శేఖర్, సాయి సుధాకర్, డెప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి సత్యకుమార్ యాదవ్


