లబ్బీపేట(విజయవాడతూర్పు): సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయమని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం, సహాయం అందించే అధికారం, సమాజాన్ని చదివే, ప్రజలకు నేరుగా సేవ చేసే అద్భుత అవకాశం ఒక్క పోలీస్ శాఖలోనే లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన పలువురు అధికారులు, సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో నిరంతర ఆందోళన, భయాలు అనేక సవాళ్లు ఉంటాయని, ఎన్ని ఉన్నా, ఒక మంచి పని చేసి బాధితుడికి న్యాయం చేసినప్పుడు వచ్చే ఆత్మ సంతృప్తి మరెక్కడా లభించదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన టెక్నికల్ వింగ్ డీసీపీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, సీసీఎస్ అడిషనల్ డీసీపీ రాజారావు, సీపీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పి.సునీత, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఐటీ సువర్ణరాజు, ఎస్‌ఐ జి. లాచిరాం, ఆర్‌ఎస్‌ఐ వి.వీరరాజు, ఏఎస్‌ఐలు రామకృష్ణ, జె.మన్మథరావు, రిజర్వ్ హెచ్‌సీ టి.వీరరావు, హోంగార్డు పి భాస్కరరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, సీఎస్ డబ్ల్యూ డీసీపీ బి.సత్యనారాయణ, ఏఆర్ ఏసీపీ ప్రేమకుమార్, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, సుధాకరరెడ్డి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మధురై మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాన్పూర్ సెంట్రల్–మధురై (01925) ప్రత్యేక రైలు ఆగస్టు 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి బుధవారం ఉదయం 8.10 గంటలకు కాన్పూర్ సెంట్రల్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మధురై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (01926) ఆగస్టు 8, 15, 22, 29 తేదీల్లో ప్రతి శనివారం మధ్యరాత్రి 2.30 గంటలకు మధురైలో బయలుదేరి, సోమవారం ఉదయం 4.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో రైళ్లు నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్హార్ష, కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలార్‌పట్టాయ్, సెలాం స్టేషన్లలో ఆగుతుంది.
జిల్లాలో 14 రైతుబజార్లు,
30 రైస్ మిల్లుల్లో కౌంటర్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో రైతుబజార్లు, రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా పౌరసరఫరాల కార్యాలయ డి.ఎస్.ఒ, ఏఎస్‌ఓలు, డీటీలు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెలతో పోలిస్తే ప్రస్తుతం బియ్యం బీపీటీ, సోనా మసూరి రకాలు క్వింటాల్ రూ. వెయ్యి నుంచి రూ.1400కు చేరిందన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 14 రైతు బజార్లలో, 30 రైస్ మిల్స్‌లో కౌంటర్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. వీటి ద్వారా స్టీమ్ రైస్ కిలో రూ. 52, రా రైస్ రూ. 50కే విక్రయిస్తారన్నారు. ఈ కౌంటర్లకు బియ్యం ఏఏ మిల్లుల నుంచి సరఫరా చేయాలి? రైస్ మిల్లర్స్ ఎక్కడెక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చించారు. బియ్యం కొనుగోలు చేసేందుకు కౌంటర్లకు వెళ్లే వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ తీసుకెళ్లాలని సూచించారు.


