గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7,71,648 మంది, మహిళా ఓటర్లు 8,17,936 మంది, థర్డ్ జెండర్ 147 ఉన్నాయి. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. సీ్త్ర, పురుష నిష్పత్తి 1060 కాగా, ప్రతి వెయ్యి మంది జనాభాకు 650 మంది ఓటర్లుగా ఉన్నారు. జిల్లాలో 13,755 మంది పీడబ్ల్యూడీ, సర్వీస్ ఓటర్లుగా, 367 మంది సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు.
క్లయిమ్స్, అభ్యంతరాలకు గడువు
జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు అవసరమైతే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు విధించారు. నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. సవరణల ప్రక్రియలో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన,విచారణ,పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. సర్‌లో అవసరమైన వివరాలు సమర్పించని వారు లేదా సమర్పించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తారు. వాటికి నిర్ణీత గడువులోపు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటంది.
తగ్గిన ఓట్లు
2026 మే ఓటర్ల జాబితాతో పోలిస్తే 1,23,714 ఓట్లు తగ్గిపోయాయి. మరణాలు, శాశ్వత వలసలు, డబుల్ ఎంట్రీలు తొలగించగా జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లకు 15,89, 731 ఓట్లు తేలాయి. ఏడు నియోజకవర్గాల్లో 13 వేల నుంచి 21వేల వరకు ఓట్లు తగ్గాయి.
అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ముసాయిదా జాబితా విడుదల చేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా అందుబాటులో ఉంచుతామన్నారు.
జిల్లాలో 15.89 లక్షల మంది ఓటర్లు
పురుషులు 7,71,648 మంది
సీ్త్రలు 8,17,936 మంది
నేటి నుంచి ఆగస్టు 30 వరకు
క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం
అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా


