ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి పనులు, ఉచిత ప్రసాద వితరణకు భీమవరానికి చెందిన భక్తులు గురువారం రూ.2.50 లక్షల విరాళం సమర్పించారు. భీమవరం ఏఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన వెంకట దుర్గాశిరీష కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2.50 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యా దలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్య, పరిశోధనలను ఈ–రీసోర్సులు మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పులాల చంద్ర శేఖర్ అన్నారు. వర్సిటీ పరిధిలోని ఎన్టీఆర్ మెడ్ నెట్ కన్సార్టియం– డిజిటల్ లైబ్రరీ ఆధ్వర్యంలో ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థల సహకారంతో గురువారం ఈ–రీసోర్సులపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమాన్ని వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వీసీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆధునిక వైద్య విద్య, పరిశోధన, సాక్ష్యాధార ఆధారిత వైద్య సేవలకు నాణ్యమైన ఈ–రీసోర్సులు ఎంతో కీలకమని అన్నారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ మెడ్‌నెట్ ఈ–రీసోర్సులను సమర్థంగా వినియోగించిన కళాశాలలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.లక్ష్మీసూర్యప్రభ, సీఓఈ శ్రీకాంత్, కన్సార్టియం కోఆర్డినేటర్ డాక్టర్ కె.సుధ పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీఈ ఏపీసెట్ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ నెల 26వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనను చేపట్టారు. సాధారణ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేశారు. స్పెషల్ కేటగిరికి చెందిన సీఏపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్, ఎన్‌సీసీ, దివ్యాంగ విద్యార్థులు ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌కు స్వయంగా హాజరై సర్టిపికెట్ల పరిశీలన చేయించుకున్నారు. ఎన్‌సీసీ 179, దివ్యాంగ 143, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 71 మంది చొప్పున మొత్తం 393 మంది సర్టిఫికెట్లను గురువారం పరిశీలించామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి తెలిపారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తాగునీటికే తొలి ప్రాధాన్యమని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా సాగునీటి సలహా మండలి చైర్మన్, డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన ఐదో సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక కృష్ణా నదిపై ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జలాశయాలకు వచ్చే నీటిని తొలి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నదిలోనూ నీటి ప్రవాహం తగ్గిపోవడంతో పట్టిసీమలోని 24 పంపులను పూర్తిస్థాయిలో వినియోగించే పరిస్థితి లేదన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన ‘వేసిన ప్రతి పంటకూ బీమా చేయాల్సిందే’ పోస్టర్‌ను జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ జి.గుణకరరావు, కేఈ డివిజన్ ఈఈ బి.ఆంజనేయప్రసాద్, కేసీ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, స్పెషల్ డివిజన్ ఈఈ కె.బాబు తదితరులు పాల్గొన్నారు.


