కోలాహలం.. సారె సంబరం | - | Sakshi
Sakshi News home page

కోలాహలం.. సారె సంబరం

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు, భక్తబృందాల సభ్యులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ ఏడాది సారె సంబరానికి బంధువులు, చుట్టాలను సారె సంబరానికి ఆహ్వా నించడంతో భక్తుల ఇంట పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గ్రామదేవతలకు ఏడాదికి ఒక సారి ఊరు పండుగ చేసుకోవడం ఆనవాయితీ. అదే రీతిలో ఈ ఏడాది ఆషాఢ సారె ఉత్సవాన్ని ఊరి పండుగలా భక్తులు జరుపుకోవడం విశేషం. ఉత్తరాంధ్ర నుంచి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో కళకళలాడుతూ కనిపించింది.

ఉచితంగా రూ.100 క్యూలోకి..

గురువారం సాయంత్రం వరకు 39 భక్త బృందాలతో పాటు మొత్తం 17 వేల మందికి పైగా భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. మహామండపం లిఫ్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్డులో కొండపైకి విచ్చేసిన సారె బృందాలకు రూ.100 టికెట్‌ క్యూలైన్‌లోకి ఉచితంగా అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు మహామండపం ఆరో అంతస్తుకు చేరుకుని ఉత్సవ మూర్తిని దర్శించుకుని సారె సమర్పిస్తున్నారు. అక్కడే ఉన్న చీరల కౌంటర్‌లో అమ్మవారికి చీర సమర్పించిన అనంతరం భక్తులందరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అమ్మవారికి సమ ర్పించిన పసుపు, కుంకుమ, గాజులు, మిఠాయిలను తాంబూలంగా ఇచ్చి పుచ్చుకున్నారు.

బాలాజీ కోలాట బృందం ఆధ్వర్యంలో...

భవానీపురంలోని టెలిఫోన్‌ కాలనీ, బాలాజీ టవ ర్స్‌కు చెందిన శ్రీ బాలాజీ కోలాట భక్త బృందం సభ్యులు గురువారం అమ్మవారికి సారెను సమ ర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి నామస్మరణతో, భక్తి కీర్తనలతో కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. సాంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కేఎల్‌రావు పార్కు లోని అబ్దుల్‌ కలామ్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. కేఎల్‌రావు నగర్‌ నుంచి సారెతో వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఊరేగింపుగా బయలుదేరి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement