గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): జిల్లాలో ప్రతిపాదించిన టూరిజం ప్రాజెక్టులు డీపీఆర్‌లకే పరిమితం కాకూడదని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు.
భవానీ ఐల్యాండ్ కోసం..
భవానీ ఐల్యాండ్ వద్ద రూ.75కోట్ల అంచనా వ్యయంతో పదెకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఏఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, 500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ హాల్ తదితర ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జూలై–2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అంబేడ్కర్ స్మృతివనంలో..
స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 75మంది సామర్థ్యంతో మినీ థియేటర్‌ను పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యా, వైజ్ఞానిక, అవగాహన చిత్రాల ప్రదర్శనకు వినియోగించాలన్నారు. నదిహారతి ఆర్టీసీ బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ


