మహిళా రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపాలి

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, అందుకు పార్టీ లకు అతీతంగా అన్ని పార్టీలు చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘాల ఐక్యవేదిక కోరింది. ఈ మేరకు వారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మల్లాది విష్ణును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ.. 2023లో భారత రాజ్యాంగ (106వ రాజ్యాంగ సవరణ) చట్టం ద్వారా మహిళా రిజర్వే షన్లకు చట్టబద్ధత కల్పించినా జనగణన, డీలిమిటేషన్‌ పూర్తయ్యే వరకు వాయిదా వేయడంతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ షరతులు లేకపోయి ఉంటే ప్రస్తుత లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం ఉండేదని, అయితే అది 14 శాతానికి కూడా చేరలేదని వివరించారు. సుమారు 185 దేశాల జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారత దేశం 151వ స్థానంలో ఉండటం దేశానికి అవమానకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు సాగించిన పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తాత్సారం, మహిళల రాజకీయ సాధికారతను అడ్డుకోవడం కారణమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌ వంటి వివాదాస్పద అంశాలతో ముడిపెట్టకుండా రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే అమలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్య దర్శి వి.సావిత్రి, అధ్యక్షురాలు శ్రీదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.పద్మ, సీఎంఎస్‌ నాయకులు ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాల ఐక్య వేదిక వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement