లబ్బీపేట(విజయవాడతూర్పు): కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో బుధ వారం ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి దేవినేని అవినాష్, ఇతర పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాపు ఉద్యమ నేతగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించిన నాయకుడిగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పార్లమెంట్ కార్యదర్శిలు తంగిరాల రామిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళ్లిక, పుప్పాల కుమారి, కలపాల అంబేడ్కర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.


