ఆర్జిత సేవలకు డిమాండ్.. రద్దీ సాధారణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చొల్లంగి అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరిగిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన రెండు షిఫ్టుల్లో మొత్తం 30 మందికి పైగా ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. తొలుత అమ్మవారికి జరిగిన సుప్రభాత సేవలో 18 మంది పాల్గొన్నారు. ఇక నూతన పూజా మండపంలో జరిగిన లక్ష కుంకుమార్చనలో 23మంది ఉభయదాతలు, శ్రీచక్రనవార్చనలో 12 మంది ఉభయదాతలు, చండీహోమంలో 227 ప్రత్యేక్షంగాను, 71 పరోక్షంగా జరిపించుకున్నారు. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, శాంతి హోమాలలోనూ ఉభయదాతలు పాల్గొన్నారు.
రద్దీ సాధారణం..
ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. తెల్లవారుజామున కొద్దిగా రద్దీ ఉండటంతో గత మూడు రోజుల పరిస్థితే నెలకుంటుందని ఆలయ అధికారులు భావించారు. ఉదయం 9 గంటల కల్లా ఆలయ అధికారులు, సిబ్బంది ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విధులకు హాజరయ్యారు. అయితే 10 గంటల తర్వాత కూడా రద్దీ అంతంత మాత్రంగా ఉండటంతో సంక్రాంతి రద్దీ ముగిసిందని ఆలయ అధికారులు భావించారు. సిఫార్సులపై వచ్చే వారిని సైతం రూ. 500 టికెట్లు ఇచ్చి వీఐపీ దర్శనం కల్పించారు. అయితే కొంత మంది మాత్రం ప్రముఖుల సిఫార్సులతో అమ్మవారి దర్శనానికి వచ్చామని, టికెట్లు కొనుగోలు ఎందుకు కొనుగోలు చేయాలని ఆలయ సిబ్బందిని ప్రశ్నించించడం కనిపించింది. వీఐపీలైనా రూ. 500 టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని ఆలయ అధికారులు, సిబ్బంది పేర్కొనడం కనిపించింది.
లోక కల్యాణార్థం సూర్యోపాసన సేవ..
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవను ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సూర్యోపాసన సేవ 9 గంటలకు ప్రారంభం కాగా 10.20 గంటల వరకు స్వామి వారి అలంకరణకు అవసరమైన పూలను తీసుకురాకపోవడంతో ఆలయ ఈవో శీనానాయక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


