సవాళ్లను అధిగమిస్తూ సరికొత్త పయనం
కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా అభివృద్ధి దిశగా కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగులు వేస్తున్నా మని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఏడాది కాలంలో అందరి సహకారంతో సమష్టి కృషితో ఎన్నో విజయాలు సాధించామని పేర్కొన్నారు. గతంలో ఎదు రైన సవాళ్లను అధిగమిస్తూ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అందరి సహకారంతో 2026లోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తామన్నారు. విజయవాడ గురునానక్ కాలనీ రోడ్డులోని శుభలగ్న వేదిక ఫంక్షన్ హాల్‌లో మీడియా ప్రతినిధులతో బుధవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యంగా పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి 315 కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో 83 స్కోరుతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో జిల్లా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ప్రతి సూచికలోనూ ముందంజలో నిలిచేందుకు కృషి చేస్తామని వివరించారు. 2023 – 24లో తలసరి ఆదాయం రూ.3,21,651 కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.4,17,412 అని తెలిపారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి దిశగా పయనిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
అన్ని నియోజకవర్గాల్లో
దార్శనిక ప్రణాళికలు
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గ అభివృద్ధిపై దార్శనిక ప్రణాళికలతో ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి. రెండు ప్రపంచ రికార్డులు కూడా సొంతం చేసుకున్నామని తెలిపారు.
లోటుపాట్లను సరిదిద్దుకుంటూ..
నిర్మాణాత్మక సద్విమర్శలను స్వీకరించి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఒక్క పారిశ్రామిక రంగంలోనే కాకుండా అన్నింటా ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్‌కు ప్రాధాన్యమిస్తూ సత్వర ప్రగతికి టీమ్ ఎన్టీఆర్ కృషి చేస్తున్నట్లు పేర్కొ న్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పోల్చితే జిల్లాలో సేవారంగం అధిక శాతం వాటా (దాదాపు 67 శాతం) కలిగి ఉందని వివరించారు. ఈ రంగంలో మరింత అభివృద్ధికి ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ యాప్‌తో పాటు ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మోంథా తుపాను సమయంలో డేటా అనలి టిక్స్ సహాయంతో తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. పరిపాలనలోనూ రియల్‌టైమ్ గవర్నెన్స్, డేటా బ్యాంకు సహకారంతో ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్‌ఓ కె.వి.రమణరావు, డివిజనల్ పీఆర్‌ఓ కె.రవి, ఆడియో విజువల్ సూపర్‌వైజర్ వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


