రెచ్చిపోతున్న ఆయిల్ దొంగలు
రెచ్చిపోతున్న ఆయిల్ దొంగలు జి.కొండూరు: చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది దొంగల పరిస్థితి. ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు వ్యక్తులు రహదారుల పక్కన ఆపి ఉన్న లారీల్లో డీజిల్‌ను చోరీ చేసి విక్రయించడమే ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. అంతే కాకుండా ఆయిల్ లోడుతో వెళ్తున్న రైళ్లు ఆపి ఉన్న సమయంలో ఆయిల్‌ను చోరీ చేస్తూ నెలకు రూ.లక్ష ల్లో సంపాదిస్తున్నారంటే ఆయిల్ చోరీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల సరిహద్దుల్లో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆయిల్ డిశ్చార్జ్ పాయింట్లు ఉండడంతో ఏళ్ల తరబడి ప్రత్యేకంగా ఒక ముఠా ఈ ఆయిల్ చోరీ, విక్రయమే జీవనాధారంగా ఎంచుకుంది.
సంస్థలన్నీ ఒకే చోట..
జి.కొండూరు మండల పరిధిలోని కట్టుబడిపాలెం, ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఐడీఏలో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ వంటి సంస్థలకు చెందిన ఆయిల్, గ్యాస్ డిశ్చార్జ్ పాయింట్లు ఒకే చోట ఉన్నాయి. ఈ సంస్థలలో ఆయిల్, గ్యాస్‌ను రవాణా చేసేందుకు 600కి పైగా లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. అంతే కాకుండా గడ్డమణుగు, కొండపల్లి ప్రాంతాలలో ఉన్న క్రషర్లు, క్వారీల నుంచి మెటల్, గ్రావెల్, డస్టును రవాణా చేసేందుకు 200 వరకు టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ లారీలు లోడింగ్, అన్‌లోడింగ్ తర్వాత డ్రైవర్‌లు విశ్రాంతి కోసం రహదారుల పక్కన నిలిపి ఉంచి వెళ్తారు. ఇదే అయిల్ దొంగ లకు వరంగా మారుతోంది. ప్రత్యేకంగా ఏర్పడిన ఆయిల్ చోరీ ముఠా వాహనంలో మోటారును అమర్చుకొని డ్రైవర్‌లేని వాహనాన్ని ముందుగా పసిగట్టి ఆ వాహనానికి ఉన్న ఆయిల్ ట్యాంకరు తాళం పగలగొట్టి మోటారు ద్వారా వాహనంలో ముందుగానే ఉంచిన క్యాన్‌లలో నింపుకొని పారిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇలా చోరీ చేసిన ఆయిల్‌ను గ్రామీణ ప్రాంతాలలో బడ్డీ కొట్ల నిర్వాహకులకు లీటరు రూ.80కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
రైళ్లనూ వదలరు..
కట్టుబడిపాలెం వద్ద ఉన్న హెచ్‌పీసీఎల్ నుంచి డీజిల్, పెట్రోల్ రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తారు. ఈ క్రమంలో ఆయిల్‌ను లోడు చేసిన తర్వాత ట్యాంకర్లతో ఉన్న రైలు కంపెనీ నుంచి బయటకు వచ్చి సిగ్నల్ కోసం జి.కొండూరు, పినపాక గ్రామాల శివారులో వ్యవసాయ భూముల మధ్యలో ఉన్న ట్రాక్‌పై నిలుపుతారు. ఈ ప్రాంతా న్నే ఆయిల్ చోరీ ముఠా అనువుగా ఎంచుకుంటున్నారు. రాత్రి సమయాలలో ఇలా నిలిపి ఉంచిన ట్యాంకర్ల కింద ఉన్న ఆయిల్ డిశ్చార్జ్ పైపునకు ఉన్న బోల్టులను లూజు చేయడం ద్వారా ఆయిల్‌ను సేకరించి చోరీ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు తమ మోపెడ్ వాహనాలపై ఒక్కసారి వంద లీటర్లు వరకు క్యాన్‌లలో నింపుకొని గడ్డమణుగు లోయ మీదుగా చెర్వుమాధవరం, గడ్డమణుగు గ్రామాల మీదుగా తరలిస్తున్నట్లు ఇటీవల జరిగిన ఒక ఘటనతో వెలుగులోకి వచ్చింది.
కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం..
గత కొన్నేళ్లుగా ఈ ఆయిల్ చోరీ దందా కొనసాగుతున్నప్పటికీ అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. ఏడేళ్ల క్రితం 2018, సెప్టెంబరు 26వ తేదీన అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు విజయవాడ డివిజన్ ఏఎస్‌ఓ కోమలి పద్మ ఆధ్వర్యంలో కంకిపాడు పీడీఎస్ డీటీ రామకృష్ణ స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి ఈ చోరీ ఆయిల్ నిల్వలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో కట్టుబడిపాలెం గ్రామ సమీపంలోని ఐఓసీఎల్ కంపెనీ గేటు ఎదురుగా ఉన్న రెండు హోటళ్లు, ఒక బడ్డీ కొట్టు, ఒక గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 1200లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క దాడి కూడా చేయకపోవడంతో ఆయిల్ చోరీ ముఠా రెచ్చిపోతుంది. ఆయిల్ దందాలో అధికారుల పాత్రపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.
●
రోడ్డు పక్కన నిలిపిన
లారీల్లో డీజిల్ చోరీ చేస్తున్న ముఠా
ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్
రైళ్ల నుంచి పెట్రోల్, డీజిల్ చోరీ
బడ్డీ కొట్లలో యథేచ్ఛగా చోరీ చేసిన
పెట్రోల్, డీజిల్ విక్రయాలు
నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్న
ఆయిల్ చోరీ ముఠా
ఈ నెల 15వ తేదీన రాత్రి పినపాక శివారు విద్యానగరం వద్ద 30వ నంబరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన గ్యాస్ బండల లోడు లారీలోని ట్యాంకర్ నుంచి 200లీటర్ల డీజిల్‌ను దొంగలు చోరీ చేశారు. దీనిపై సదరు వాహన డ్రైవర్ జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. ఇదేరోజు పక్కనే ఉన్న మరో లారీలో ఆయిల్ చోరీ జరిగినప్పటికీ సదరు వాహన డ్రైవర్ ఫిర్యాదు చేయలేదు.
ఈ నెల మొదటి వారంలో గడ్డమణుగు లోయ నుంచి చెర్వుమాధవరం వైపు మోపెడ్ వాహనంపై 70లీటర్ల పెట్రోల్‌ను క్యాన్‌లలో తీసుకొని వస్తున్న వ్యక్తిని పైపులైన్ సేఫ్టీ వాకర్స్ పట్టుకొని జి.కొండూరు పోలీసులకు అప్పగించారు. సదరు వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా.. ఆగి ఉన్న అయిల్ ట్యాంకరు రైలు నుంచి ఆయిల్‌ను సేకరించినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.
1/2
రెచ్చిపోతున్న ఆయిల్ దొంగలు
2/2
రెచ్చిపోతున్న ఆయిల్ దొంగలు