రైతుల గుండెల్లో దడదడ
తరుముకొస్తున్న వాయుగుండం ఘంటసాలలో పలుచోట్ల చిరుజల్లులు ధాన్యం అమ్ముకునేందుకు అవస్థలు
అవనిగడ్డ: వాయుగుండం హెచ్చరికతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలు చేతికందే సమయంలో వాతావరణ మార్పులతో ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందనని ఆందోళన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణాజిల్లాలో రైతులు వరికోతలను ముమ్మరం చేశారు. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. పంటను రహదారుల వెంట ఆరబెట్టుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు.
వాయుగుండం హెచ్చరికతో వరికోతలు ముమ్మరం
కృష్ణా జిల్లాలో ఈ ఏడాది 3.85 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం పామర్రు, మొవ్వ, ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 25 శాతం వరికోతలు జరిగినట్టు అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ నెల 24వ తేదీ సోమవారం బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం ఘంటసాల మండలంలో పలుచోట్ల చిరుజల్లులు పడటంతో ఆరబెట్టిన ధాన్యంను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను దెబ్బకు దిగుబడులు బాగా తగ్గాయని పలువురు తెలిపారు.
ఆరబెట్టుకునేందుకు అవస్థలు
రైతులు పంటను ఆరబెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా రోడ్ల పక్కకు చేర్చి కూలీలతో ధాన్యాన్ని ఆరబెట్టు కుంటున్నారు. సాయంత్రం 5 గంటలకే మంచు రావడంతో ధాన్యంను రాసులుగా చేర్చి పట్టాలు కప్పిస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ ఖర్చులు పెరిగిపోతున్నాయని కొంతమంది రైతులు తెలిపారు
కలవర పెడుతున్న మానుకాయ
పదిహేను రోజుల నుంచి మంచు పెరగడంతో వరిపొలాలకు మానుకాయ ఎక్కువగా కనపడుతోంది. కంకులు పాలు పోసుకునే దశలో మంచు బిందువులు లోపలకు వెళ్లడంతో మానుకాయ వస్తుందని చెప్పారు. దీంతో ఎకరాకు రెండు, మూడు బస్తాలు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో సాగుచేసిన ఎంటీయూ 1318 రకం మిల్లర్లు కొనక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ
జిల్లాలో ఎకరాకు 15 బస్తాల నుంచి 25 బస్తాల వరకూ కౌలు పలుకుతుంది. రెండో పంట అపరా అయ్యే పొలాలకు 20 నుంచి 25 వస్తాలు కౌలు ఇస్తున్నారు.
మెంథా తుపాను దెబ్బకు 28 బస్తాలకు మించి దిగుబడులు రావడం లేదు. దీంతో ఈ పంటలో ఖర్చులు కూడా రావని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
35 బస్తాలు అవుతాయనుకుంటే 28 అయ్యాయి
ఎకరంన్నర్ర కౌలుకు సాగు చేశాను. ఇటీవల వచ్చిన తుపానుకు పంట వాలిపోయింది. అంతకు ముందు పంటను చూసి 35 బస్తాలకు పైగా దిడుబడి వస్తుందనుకున్నాను. తీరా యంత్రంతో కోయిస్తే 28 బస్తాలే దిగుబడి వచ్చింది. ఇందులో 24 బస్తాలు కౌలుకే ఇవ్వాలి.
– కాగిత కాళేశ్వరరావు, రైతు, మోపిదేవి
1318 రకం కొనడం లేదు
ఘంటసాల వ్యవసాయ క్షేత్రం నుంచి సరఫరా చేసిన ఎంటీయూ 1318 రకం 30 ఎకరాల్లో సాగుచేశాను. స్థానిక సిబ్బందితో చెబితే జీపీఎస్ వాహనాలు సమకూరుస్తామని చెబితే సగం పొలం వరకూ యంత్రాలతో కోయించారు. శాంపిల్స్ తీసుకుని చల్లపల్లి, ఘంటసాల మండలంలోని పలు మిల్లులకు వెళితే ఈ రకం కొనడం లేదని చెప్పారు. ఇప్పుడేమో వాయుగండం అంటున్నారు. కోసిన పంటను ఏమిచేయాలో తెలియడం లేదు.
– గొరిపర్తి రాజేష్, కౌలురైతు, ఘంటసాల
రైతుల గుండెల్లో దడదడ
రైతుల గుండెల్లో దడదడ
రైతుల గుండెల్లో దడదడ


